Bhayyaji: భయ్యాజీ ప్రతీకారం

‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది.

Updated : 10 May 2024 09:55 IST

‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. బాలీవుడ్‌ కథానాయకుడు మనోజ్‌ బాజ్‌పేయీ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. అపూర్వ సింగ్‌ కర్కి దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మనోజ్‌ యాక్షన్‌ అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘‘ప్రతీకారం తీర్చుకోవడంలో ఈ భయ్యాజీది మాస్టర్‌ మైండ్‌’, ‘రాబిన్‌ హుడ్‌ కాదు.. రాబిన్‌ హుడ్‌ కా బాప్‌’’ లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్‌. ప్రతీకార నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలు ప్రధానాంశంగా ఉండనున్నట్లు తెలిపింది చిత్రబృందం. వినోద్‌ భనుషాలీ నిర్మిస్తున్న  సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.


‘ఆరంభం’తో కొత్త తారలు పుట్టుకొస్తారు

మంచి కథ కుదిరితే ‘ఆరంభం’ బృందంతో కలిసి ఓ సినిమా చేస్తానన్నారు శ్రీవిష్ణు. ఈ సినిమాతో చాలా మంది కొత్త తారలు పుట్టుకొస్తారనీ, వాళ్లలో అంత ప్రతిభ వుందని చెప్పారు. ఆయన ముఖ్య అతిథిగా ఇటీవల హైదరాబాద్‌లో  ‘ఆరంభం’ విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. మోహన్‌ భగత్‌, సుప్రీత సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, రవీంద్ర విజయ్‌ ప్రధాన పాత్రధారులుగా... అజయ్‌ నాగ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. అజయ్‌ నాగ్‌.వి దర్శకత్వం వహించారు. అభిషేక్‌.వి.టి నిర్మాత. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్బంగా నిర్వహించిన వేడుకకి శ్రీవిష్ణుతోపాటు, మరో కథానాయకుడు తిరువీర్‌, దర్శకులు వెంకటేశ్‌ మహా, నవీన్‌ మేడారం, కథానాయిక శివానీ నాగారం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


ఆ హంతకుల్ని ఎలా పట్టుకున్నారు?

త్యాచారానికి గురైన ఓ యువతి కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి? దారుణానికి ఒడికట్టిన నిందితుల్ని ఆ అధికారి ఎలా పట్టుకున్నారు? అనేది తెలియాలంటే ‘సిట్‌’ (స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌) చూడాల్సిందే. పోలీసు అధికారి పాత్రలో అరవింద్‌ కృష్ణ నటించిన చిత్రమిది. రజత్‌ రాఘవ్‌, నటాషా దోషి  ప్రధాన పాత్రలు పోషించారు. రుచిత సాధినేని, అనుక్‌ రాథోడ్‌, కౌశిక్‌ మేకల ఇతర పాత్రలు పోషించారు. నాగిరెడ్డి, తేజ్‌ పల్లి, గుంటక శ్రీనివాస్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో కథానాయకుడు విష్వక్‌సేన్‌ విడుదల చేశారు. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. నిజాయతీ గల  పోలీసుగా అరవింద్‌ కృష్ణ ఆకట్టుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేకెత్తిస్తూ మంచి వినోదాన్ని పంచుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.


తమిళ క్లైమాక్స్‌కు భిన్నంగా తెలుగులో!

‘‘సత్య’ అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది. తమిళ వెర్షన్‌ క్లైమాక్స్‌కు తెలుగు వెర్షన్‌ క్లైమాక్స్‌ పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత శివ మల్లాల. హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దాస్‌ తెరకెక్కించిన చిత్రమే ‘సత్య’. దీన్ని శివం మీడియా పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత శివ. ఇది శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శివ మాట్లాడుతూ.. ‘‘తండ్రీకొడుకుల అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు.


ప్రేమా? ఆకర్షణా?

‘నిజమైన ప్రేమకు... ఆకర్షణకు తేడా తెలియకుండా యువతరం తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలిపే కథతోనే మా చిత్రం రూపొందుతోంద’న్నారు శిరిన్‌ శ్రీరామ్‌. ఆయన దర్శకనిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రేమించొద్దు’. అనురూప్‌ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రధారులు. ఐదు భాషల్లో రూపొందిన ఈ సినిమాని జూన్‌ 7న తెలుగులో విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ‘‘బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించే ఈ కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతాయి. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. తెలుగులో విడుదలయ్యాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ తెలిపింది చిత్రబృందం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని