Supriya: ఈ చిత్రం... పచ్చడన్నం లాంటిది

‘‘చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాటిలో నుంచే కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాబట్టి ప్రతి పెద్ద బ్యానర్‌ తప్పకుండా చిన్న చిత్రాలు తీయాలి. ప్రస్తుతం ఆ ఒరవడి తెలుగులో బాగానే కనిపిస్తోంది. అదింకా పెరగాలి.

Updated : 21 Nov 2021 07:09 IST

‘‘చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాటిలో నుంచే కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కాబట్టి ప్రతి పెద్ద బ్యానర్‌ తప్పకుండా చిన్న చిత్రాలు తీయాలి. ప్రస్తుతం ఆ ఒరవడి తెలుగులో బాగానే కనిపిస్తోంది. అదింకా పెరగాలి. ఓ చిన్న సినిమాని హిట్‌ చేయగలిగితే ఆ వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేమ’’న్నారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. ఇప్పుడామె నిర్మాణంలో రూపొందిన చిత్రమే ‘అనుభవించు రాజా’. రాజ్‌ తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా నటించారు. శ్రీను గవిరెడ్డి   దర్శకుడు. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సుప్రియ. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

అన్నపూర్ణ స్టూడియోస్‌ కథలన్నీ తొలుత మీరే వింటారా?
ఈ బ్యానర్‌ మీద చేసే సినిమా కథలన్నీ దాదాపుగా నేనే వింటా. స్క్రిప్ట్‌ బాగుంది.. సినిమాగా మలచొచ్చని ఏమాత్రం అనిపించినా ఆయా నటీనటులకు పంపిస్తా. ఒకవేళ నాగార్జున మామ, చైతన్య హీరోలుగా కథలు వస్తే.. ముందు వాళ్లకే వినిపిస్తా. వేరేవరైనా వాళ్ల కథలతో నా దగ్గరకొచ్చినా.. నేరుగా వాళ్లకే వినిపించమని చెప్పేస్తుంటా.

సుప్రియకు కథ చెప్పి.. ఒప్పించడం కష్టమంటారు నిజమేనా?
నేనెప్పుడూ కథ నచ్చితేనే ముందుకెళ్తాను. ఈ చిత్ర కథ వింటున్నప్పుడు చాలా నవ్వాను. నేను నవ్వానంటే మరో పది మంది నవ్వుతారనే కదా. అందుకే విన్న వెంటనే ఈ సినిమా ఒకే చేశా. ఈ కథ మీద ఓ ఆరు నెలలు కూర్చోవాలి అని చెబితే కొందరు పారిపోతారు. శ్రీను అలా పారిపోతాడనుకున్నా. కానీ, ఉన్నాడు. ఓపికగా సినిమా చేశాడు.

ఇంతకీ ఈ ‘అనుభవించు రాజా’ ఎలా ఉంటుంది?
పచ్చడన్నం లాంటి సినిమా ఇది. చిన్న సందేశం చెప్పి.. చిన్న నవ్వు నవ్వించి.. సంతృప్తిగా ఇంటికి పంపిస్తుంది. ఓ మంచి తెలుగు సినిమా చూశామన్న అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుంది. మన ఊరు నేటివిటీ, అక్కడి వాతావరణాన్ని అందరం మిస్‌ అవుతుంటాం కదా. ఇందులో అవన్నీ ఉన్నాయి. వంశీ గారి ‘ఏప్రిల్‌ 1న విడుదల’, ‘లేడీస్‌ ట్రైలర్‌’ సినిమాల్లా ఉంటుంది.

కథ విన్నప్పుడే రాజ్‌ తరుణ్‌ని హీరోగా అనుకున్నారా?
అవును. రాజ్‌లో మంచి కామిక్‌ టైమింగ్‌.. ఓ వెటకారం అన్నీ ఉంటాయి. కథ వినగానే తను చేస్తేనే బాగుంటుందనిపించి తీసుకున్నాం. రాజ్‌ తరుణ్‌ పాత్రలో రెండు షేడ్స్‌ ఉంటాయి. హాల్లో నలుగురితో కలిసి చూస్తూ.. నవ్వుకునే చిత్రమిది.


‘బంగార్రాజు’ సంక్రాంతికి వచ్చే అవకాశముందా?

ప్రస్తుతానికి మా లక్ష్యమైతే సంక్రాంతే. ఇప్పటికే మూడు సినిమాలు పండక్కి వస్తామని ప్రకటించాయి. ఆ మూడు వస్తే.. ‘బంగార్రాజు’కు చోటుండకపోవచ్చు. వాటిలో ఏ ఒక్కటి తప్పుకొన్నా.. మేము రేసులోకి వచ్చేస్తాం. ఎందుకంటే సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలకు చోటు లేదు. రెండిటికైతే హ్యాపీగా ఉంటుంది. కావాల్సిన సంఖ్యలో థియేటర్లు  దొరుకుతాయి. ఏదేమైనా రానున్న రోజుల్లో పరిస్థితుల్ని బట్టి మేం రావాలా? వద్దా? అన్నది తేలుతుంది. ప్రస్తుతం మా బ్యానర్‌లో నాలుగు వెబ్‌సిరీస్‌లు, ఓ పెద్ద సినిమా.. మరో చిన్న చిత్రం నిర్మాణంలో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని