Cinema News: ‘రుద్రంకోట’లో ఏం జరిగింది?

సీనియర్‌ నటి జయలలిత ప్రధాన పాత్రలో నటిస్తూ, ఆమె సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘రుద్రంకోట’. కోన రాము దర్శకత్వం వహించారు. అనిల్‌ కండవల్లి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌

Updated : 03 Dec 2021 09:35 IST

సీనియర్‌ నటి జయలలిత ప్రధాన పాత్రలో నటిస్తూ, ఆమె సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘రుద్రంకోట’. కోన రాము దర్శకత్వం వహించారు. అనిల్‌ కండవల్లి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోగో ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘జయలలితతో నాకు ‘రౌడీ గారి పెళ్ళాం’ నుంచి పరిచయం. అప్పట్నుంచీ తనంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం. చాలా మంచి మనిషి. తను తొలిసారిగా ఓ చిత్రాన్ని సమర్పిస్తోందని తెలిసి నా వంతు సహకారం అందించాలని వచ్చా. ఎవరైనా చిన్న సినిమాతోనే మొదలుపెట్టి, ఉన్నత స్థానానికి వెళతారు. నిర్మాతగా నా ప్రయాణం కూడా చిన్న సినిమాతోనే మొదలైంది. ఇందులో అందరూ కొత్తవారే అని తెలిసింది. చిత్ర నిర్మాత, దర్శకుడు ఉన్నత స్థానానికి ఎదగాలి. వారి సినిమాల్లో నాకూ అవకాశం ఇవ్వాల’’న్నారు. తిరుపతిలో తాము సాయిబాబా దేవాలయాన్ని నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. తిరుపతిలో తిరుమలేశుడిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, సాయిబాబా దేవాలయానికి కూడా వచ్చి వెళ్లేంత స్థాయిలో ఆ గుడి ఉంటుందని తెలిపారు. జయలలిత మాట్లాడుతూ ‘‘హీరో అనిల్‌ రుద్రంగా, నేను కోటమ్మగా నటించాం. వాళ్లకీ ఊరుకీ సంబంధం ఏమిటి? అసలు రుద్రంకోటలో ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. ఇందులో నటించిన ప్రతీ పాత్రకీ ప్రాధాన్యం ఉంది’’ అని తెలిపారు. కార్యక్రమంలో విభీష, వెంకట్‌బాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని