The Tomorrow War : రివ్యూ: ది టుమారో వార్‌

ది టుమారో వార్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Updated : 05 Jul 2021 18:21 IST

చిత్రం: ది టుమారో వార్‌; నటీనటులు: క్రిస్‌ ప్రాట్‌, స్ట్రోవస్కీ, సిమన్స్‌, గిల్పిన్‌, సామ్‌ రిచర్డ్‌సన్‌ తదితరులు; సంగీతం: లోర్మీ బ్లాఫీ; సినిమాటోగ్రఫీ: ల్యారీ ఫాంగ్‌; ఎడిటింగ్‌: రోజర్‌ బార్టెన్‌, గారెట్‌ ఎల్కిన్స్‌; రచన: జాచ్‌ డీన్‌; నిర్మాతలు: డేవిడ్‌ ఎల్లిసన్‌, డానా గోల్డ్‌బెర్గ్‌, డాన్‌ గ్రాంజెర్‌, జులెస్‌ డాలీ, డేవిడ్‌ ఎస్‌.గోయర్‌, ఆడమ్‌ కోల్‌బెర్నర్‌; దర్శకత్వం: క్రిస్‌ మెక్‌కే; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్‌ చిత్రాలు కొత్తేమీ కాదు. ఎన్నో వందల సినిమాలు తెలుగులో అనువాదమై ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రాలను ఇక్కడి వారు బాగా ఆదరించారు. ఇక హాలీవుడ్‌లో ఏలియన్స్‌ సబ్జెక్ట్‌తో వచ్చిన చిత్రాలెన్నో. అలాంటి కోవలోనే తెరకెక్కిన మిలటరీ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ది టుమారో వార్‌’. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్ర కథేంటి? ఎలా ఉంది?

కథేంటంటే: డాన్‌ ఫారెస్టర్‌ (క్రిస్‌ ప్రాట్‌) మాజీ సైనికాధికారి. ఇరాక్‌లో జరిగిన స్పెషల్‌ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తాడు. ఆర్మీ జీవితం తర్వాత బయాలజీ ఉపాధ్యాయుడిగా స్థిరపడతాడు. భార్య (బెట్టీ గ్లిపిన్‌), కూతురు (రియాన్‌ కైరా)తో కలిసి జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు మెరుపులాంటి కాంతి నుంచి ఓ ఆర్మీ బృందం సడెన్‌గా ప్రత్యక్షమవుతుంది. తాము భవిష్యత్‌ నుంచి వచ్చామని, ఏలియన్స్‌తో పోరాడటానికి సైన్యం అవసరమని చెబుతుంది. దీంతో ప్రపంచమంతా ఒకతాటిపైకి వచ్చి, అన్ని దేశాల నుంచి సైనికులు వెళతారు. వారు కూడా సరిపోకపోవడంతో సాధారణ పౌరులు సైనికులుగా మారి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో డాన్‌ ఫారెస్టర్‌ గురించి తెలిసి భవిష్యత్‌ నుంచి వచ్చిన సైన్యం అతడిని కూడా తీసుకెళ్తుంది. ఒక బృందంగా వెళ్లిన డాన్‌ ఫారెస్టర్‌ ఏం చేశాడు? ఏలియన్స్‌ను ఎలా ఎదుర్కొన్నాడు. కల్నల్‌ మ్యూరి ఫారెస్టర్‌ (స్ట్రాహోవిస్కీ)కు డాన్‌ ఫారెస్టర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏలియన్స్‌ ఎలా అంతమయ్యాయి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఈ విశ్వంలో మానవజాతితో పాటు మరికొన్ని జీవులు కూడా ఉన్నాయని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్నారు. అవి నిజంగా ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఏలియన్స్‌ కథా వస్తువు హాలీవుడ్‌కు ఎప్పుడూ హాట్‌ కేక్‌. ఈ కథా నేపథ్యంతో చాలా చిత్రాలు వచ్చాయి. వాటిల్లో అత్యధిక చిత్రాలు విజయం సాధించాయి. కొన్ని తెలుగులోనూ అనువాదమై మన ప్రేక్షకులను అలరించాయి. అలాంటి కోవలోని చిత్రమే ‘ది టుమారో వార్‌’. అయితే, ఇక్కడ రచయిత, దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ భిన్నమైనది. భవిష్యత్‌ నుంచి వచ్చిన వారు వర్తమానంలో ఉన్న వారిని సాయం అడగటం.. వారు భవిష్యత్‌లోకి వెళ్లి ఏలియన్స్‌తో పోరాడటమన్నది సరికొత్తగా ఉంది. దాన్ని సినిమాగా తీర్చిదిద్దడంలో దర్శకుడు క్రిస్‌ మెకే విజయం సాధించారు.

డాన్‌ ఫారెస్టర్‌ ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీచర్‌గా పనిచేయటం తదితర సన్నివేశాలతో కథను ప్రారంభించాడు దర్శకుడు. అసలు కథలోకి తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం ఏమీ తీసుకోలేదు. సినిమా మొదలైన 15 నిమిషాల్లోనే అసలు పాయింట్‌ చెప్పేశాడు. డాన్‌ ఫారెస్టర్‌ తన బృందంతో కలిసి భవిష్యత్‌లోకి వెళ్లడం.. అక్కడ రీసెర్చ్‌ చేస్తున్న బృందాన్ని కాపాడాలని ప్రయత్నించడం.. వారు అప్పటికే ఏలియన్స్‌ చేతిలో హతమవడం.. దీంతో తిరిగి బయలుదేరిన ఫారెస్టర్‌ బృందాన్ని ఏలియన్స్‌ అటాక్‌ చేయడం వంటి తదితర సన్నివేశాలన్నీ ఉత్కంఠగా సాగుతాయి. ఏలియన్స్‌ బారి నుంచి బయటపడి తిరిగి వచ్చిన డాన్‌ ఫారెస్టర్‌ మళ్లీ భవిష్యత్‌లోకి వెళ్లాల్సి వస్తుంది. ఈసారి కల్నల్‌ మ్యూరి ఫారెస్టర్‌తో కలిసి అతను పనిచేయాల్సి వస్తుంది. ఓ ఏలియన్‌ను డాన్‌ ఫారెస్టర్‌, ఆర్మీ కలిసి పట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకుడిని మునివేళ్లపై నిలబెడతాయి. ఈ క్రమంలోనే ఏలియన్స్‌పై పోరాడుతున్న ఆర్మీకి నాయకత్వం వహిస్తున్న కల్నర్‌ మ్యూరి ఫారెస్టర్‌ తన కుమార్తె అని తెలుసుకుని డాన్‌ ఫారెస్టర్‌ ఆనందపడిపోతాడు. ఆయా సన్నివేశాలు భావోద్వేగ భరితంగా ఉంటాయి. విరామానికి ముందు వచ్చే ఈ సన్నివేశాలు అలరిస్తాయి. భవిష్యత్‌లోకి వెళ్లి పెద్దది అయిన తన కుమార్తెను కలుసుకోవడమన్న పాయింట్‌ ప్రేక్షకుడికి భలే మజానిస్తుంది. అయితే, తండ్రీ, కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి.

ఏలియన్‌ను పట్టుకుని దాని శరీరం నుంచే టాక్సిన్‌ను తయారు చేసి, దానితోనే వాటిని చంపాలని అనుకుంటారు. అయితే, బంధించిన ఏలియన్‌ కోసం మిగిలిన ఏలియన్స్‌ వచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం సర్వ నాశనం చేస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు యాక్షన్‌ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటాయి. టాక్సిన్‌ను తీసుకుని వర్తమానంలోకి వచ్చేసిన డాన్‌ ఫారెస్టర్‌ ఏం చేశాడన్నది ద్వితీయార్ధంలో ఉత్కంఠగా సాగుతుంది. అసలు ఏలియన్స్‌ ఎలా భూమిపైకి వచ్చాయన్న విషయాలు డాన్‌ ఫారెస్టర్‌ కనుక్కోవడం, పతాక సన్నివేశాలు భలే అలరిస్తాయి. అక్కడక్కడా కాస్త సాగదీతగా అనిపించినా, సినిమా చూసిన తర్వాత ఓ మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ చూశామన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడేవారికి హైదరాబాద్‌ ధమ్‌ బిర్యానీ దొరికినట్టే.

ఎవరెలా చేశారంటే: ‘గార్డియన్‌ ఆఫ్‌ గెలాక్సీ’, ‘అవెంజర్స్‌’ తదితర చిత్రాలు చూసిన వాళ్లకు కథానాయకుడు క్రిస్‌ ప్రాట్‌ సుపరిచితమే. ‘ది టుమారో వార్‌’లో తండ్రిగా, ఏలియన్స్‌తో పోరాడే యోధుడిగా డాన్‌ ఫారెస్టర్‌ పాత్రలో క్రిస్‌ అదరగొట్టాడు. భవిష్యత్‌లో అతని కుమార్తెగా నటించిన స్ట్రావోస్కీ చక్కగా నటించింది. యాక్షన్‌ సన్నివేశాల్లో క్రిస్‌ ప్రాట్‌తో కలిసి అలరించింది. సిమన్స్‌, సామ్‌ రిచర్డ్‌సన్‌, ఎడ్విన్‌ హోడ్జ్‌లు తమ పరిధి మేరకు నటించారు. సామ్‌ రిచర్డ్‌సన్‌ అక్కడక్కడా నవ్వులు పూయించాడు. లోమీ బ్లాఫ్‌ సంగీతం సినిమా ప్రధాన బలం. ఏలియన్స్‌తో పోరాడే సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని మరింత లీనం చేసింది. ఇక ల్యారీ ఫాంగ్‌ సినిమాటోగ్రఫీ మూవీని మరోస్థాయికి తీసుకెళ్లింది. అద్భుతమైన విజువల్‌ వండర్‌గా చూపించింది. ఇలాంటి సినిమాలు 3డీ, బిగ్‌ స్క్రీన్‌పై చూస్తే వచ్చే మజానే వేరు. రోజర్‌ బార్టెన్‌, గ్రీన్‌ ఎల్కిన్స్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. తండ్రీ, కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపించినా, ఎక్కడా అనవసర సన్నివేశాలు లేవు. రచయిత జాచ్‌ డీన్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తది. దాన్ని క్రిస్‌ మెక్‌కే అంతే అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పటివరకూ క్రిస్‌ మెక్‌కే తీసింది తక్కువ సినిమాలే అయినా, ‘ది టుమారో వార్‌’తో తన సత్తా ఏంటో చాటాడు. హాలీవుడ్‌ సినిమాల్లో రిచ్‌నెస్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బలాలు బలహీనతలు
+ కథ, కథనాలు - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
+ యాక్షన్‌ సన్నివేశాలు  
+ నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు  

చివరిగా: ‘ది టుమారో వార్‌’ ఉత్కంఠతో అలరించే యాక్షన్‌ వార్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని