Upcoming Movies: దసరా క్లియరెన్స్‌ సేల్‌.. థియేటర్‌లో ఏకంగా పది సినిమాలు.. మరి ఓటీటీలో?

Upcoming Movies in telugu: ఈసారి దసరా పండగకు అగ్ర కథానాయకుల సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో వారం సమయం ఉండటంతో ఎన్నో రోజులుగా బాక్సాఫీస్‌ను పలకరించకుండా ఆగిపోయిన సినిమాలన్నీ ఒకేసారి థియేటర్‌లకు క్యూ కట్టాయి.డబ్బింగ్‌లతో కలిపి ఏకంగా పది సినిమాలు థియేటర్‌లో రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే మూవీలు అలరించడానికి సిద్ధమయ్యాయి?

Updated : 09 Oct 2023 10:33 IST

అన్ని ఎమోషన్స్‌ మేళవించి..

పులివెందుల మహేష్‌, ప్రియాపాల్‌ జంటగా శివరామ్‌ తేజ తెరకెక్కించిన చిత్రం ‘మా ఊరి సిన్మా’ (maa oori cinema). జి.మంజునాథ్‌రెడ్డి నిర్మాత. మహేష్‌ విట్టా, ముఖేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మా చిత్రంలో తండ్రీకొడుకుల అనురాగం, బావ మరదళ్ల సరసం ఇలా అన్ని ఎమోషన్స్‌ ఉన్నాయి. కచ్చితంగా అందర్నీ ఆకట్టుకుంటామని నమ్ముతున్నాం’ అని చిత్ర బృందం చెబుతోంది.


తెలుగులో మెప్పిస్తుందా?

నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో అహ్మద్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఇరైవన్‌’. సుధన్‌ సుందరం, జి.జయరామ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తెలుగులో ‘గాడ్‌’ (GOD Movie) పేరుతో అక్టోబరు 13న విడుదల కానుంది. ‘‘విభిన్నమైన సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. తమిళంలో మిశ్రమ స్పందనలకు పరిమితమైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.


ఇప్పుడైనా వచ్చేనా?

సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నవీన్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’ (veyi daruveyyi). దేవరాజు పొత్తూరు నిర్మాత. యాశ శివకుమార్‌ కథానాయిక. సునీల్‌ కీలక పాత్ర పోషించారు.  కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అక్టోబరు 13న ఈ సినిమా విడుదల కానుందంటూ సోషల్‌మీడియాలో పోస్టర్లు వచ్చాయి. మరి ఇప్పుడైనా వస్తుందా? లేదా? చూడాలి.


ఒక ఊరి బయోపిక్‌

శివ కంఠమనేని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’ (madhurapudi gramam ane nenu). క్యాథలిన్‌ గౌడ కథానాయిక. మల్లి దర్శకత్వం వహించారు. ఓ ఊరి బయోపిక్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


సగిలేటి సంబరం

రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సగిలేటి కథ’ (sagileti katha). అశోక్‌ మిట్టపల్లి, దేవిప్రసాద్‌ బలివాడ నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ  సినిమా అక్టోబరు 13న థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘‘రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ గ్రామంలో చోటు చేసుకునే నాటకీయ సంఘటనల చుట్టూ సాగే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. కథ, కథనాలు, పాత్రలు ఆ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు సంబరంలా తెరపై ప్రతిబింబిస్తాయి’’ అని చిత్ర బృందం చెబుతోంది.


ఏంటీ ‘రాక్షస కావ్యం’

అభయ్‌ నవీన్‌, కుశాలిని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’ (Raakshasa Kaavyam). శ్రీమాన్‌ కీర్తి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దాము రెడ్డి, శింగనమల కల్యాణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైథాలజీని, నేటి సామాజిక పరిస్థితులను అన్వయించి రూపొందించిన ఈ సినిమాలో అన్వేష్‌ మైఖేల్‌, పవన్‌ రమేష్‌, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో పలు చోట్ల సినిమా పెయిడ్‌ ప్రీమియర్స్‌ను కూడా చిత్ర బృందం ప్లాన్‌ చేసింది.


నీతో నే నేను..

వికాష్‌ వశిష్ట, మోక్ష, కుషిత కళ్లపు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నీతోనే నేను’ (Neethone Nenu). అంజిరామ్‌ దర్శకుడు. ఎమ్‌.సుధాకర్‌ రెడ్డి నిర్మాత. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కమర్షియల్‌ అంశాలతో జనరంజకమైన సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది.


మరోసారి ‘రతినిర్వేదం’

మలయాళంలో రూపొందిన ‘రతినిర్వేదం’ (Rathinirvedam) ఇదివరకు తెలుగులోనూ విడుదలై విజయం అందుకుంది. శ్వేతమేనన్‌, శ్రీజిత్‌ కీలక పాత్రలు పోషించిన ఆ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. రీరిలీజ్‌ ట్రెండ్‌లో భాగంగా ఈ నెల 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత శోభారాణి తెలిపారు. ప్రాచుర్యం పొందిన నవల ఆధారంగా టి.కె.రాజీవ్‌కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎం.జయచంద్రన్‌ సంగీతం అందించారు.


థ్రిల్‌ చేసే ‘తంతిరం’

శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తంతిరం’(Tantiram). సినిమా బండి పతాకంపై శ్రీకాంత్‌ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘థ్రిల్లింగ్‌ అంశాలతో కట్టిపడేసే చిత్రమిది. ఒక మంచి సినిమాని బయటికి తీసుకు రావడానికి ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడ్డాం. చివరికి జాతీయ సినిమా దినోత్సవం రోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంది’అని చిత్ర బృందం తెలిపింది. ఇవే కాదు, వీటితో పాటు, ‘యూనివర్సిటీ’, ‘పెళ్లెప్పుడు’ వంటి తెలుగు చిత్రాలతో పాటు, ‘ధక్‌ ధక్‌’, ‘భగవాన్‌ భరోసా’ వంటి హిందీ చిత్రాలు విడుదల కానున్నాయి.


ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లివే!

ప్రేమ ప్రయాణం..

సంగీత్‌ శోభన్‌, శాన్వీ మేఘన జంటగా నటిస్తున్న తెలుగు సిరీస్‌ ‘ప్రేమ విమానం’ (prema vimanam). సంతోష్‌ కట దర్శకుడు. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. విమానం ఎక్కాలని ప్రయత్నించే కొందరి జీవితాల నేపథ్యంలో రూపొందుతున్న సిరీస్‌ ఇది.  అనసూయ, వెన్నెల కిశోర్‌, దేవాన్ష్‌ నామా, అనిరుధ్‌ నామా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  విమాన ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలను ఇందులో చూపించనున్నారు. జీ5లో అక్టోబర్‌ 13 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది.


  • నెట్‌ఫ్లిక్స్‌
  • మార్గాక్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 9
  • బిగ్‌ వాప్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 11
  • కాసర్‌గోల్డ్‌ (మలయాళం) అక్టోబరు 13
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • మతగం (తమిళం) అక్టోబరు 12
  • గూస్‌ బంప్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 13
  • సుల్తాన్‌ ఆఫ్ ఢిల్లీ (హిందీ) అక్టోబరు 13
  • ఆహా
  • మట్టి కథ (తెలుగు) అక్టోబరు 13
  • బుక్‌ మై షో
  • మిషన్‌ ఇంపాజిబుల్‌ డెడ్‌ రెకనింగ్‌ 1 (హాలీవుడ్) అక్టోబరు 11

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని