Updated : 17 Dec 2020 09:44 IST

కంటిపాపల కోసం కన్నవారి ఎదురుచూపులు! 

అజుబా: ‘‘నేను మూడురోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన నా బిడ్డను చూడగలనా అని భయమేస్తోంది. నా కుమారుడిని చూడగలననే ఆశతోనే ఉన్నాను. కానీ ఇంతవరకూ ఆచూకీ తెలియలేదు. నా కుమారుడిని చూసే వరకు నా వేదన తీరదు’’ కిడ్నాప్‌ అయిన ఓ విద్యార్థి తండ్రి అబ్దు‌ల్ వజీజ్‌ ఉస్మాన్‌ ఆవేదన ఇది. అతడే కాదు నైజీరియాలో ఇప్పుడు వందలాదిమంది తల్లిదండ్రుల పరిస్థితి అదే. తమ కంటిపాపలు కానరాకుండా పోయి మూడురోజులు అయినా ఎలాంటి ఆచూకీ లేకపోవటంతో కిడ్నాప్‌ జరిగిన పాఠశాల ఎదుటే పడిగాపులు కాస్తున్నారు. తమ చిన్నారులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో అట్టుడికే నైజీరియాలో 43 మంది రైతుల ఊచకోతను మరువకముందే జరిగిన మరో దారుణమిది. అక్కడి తల్లిదండ్రుల శోకానికి కారణమయ్యింది.

భద్రతా బలగాలను వేడుకుంటూ...
నైజీరియాలో వందలాది మంది విద్యార్థుల కిడ్నాప్‌ ఆ దేశ భద్రతపై మరోసారి సందేహాలు లేవనెత్తింది. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలోకి చొరబడిన ముష్కరులు మూడువందలకు పైగా విద్యార్థులను అపహరించుకుపోయిన ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. రైతులను హతమార్చిన బోకోహారం ఉగ్రవాదులే మరోసారి ఘాతుకానికి ఒడిగట్టారు. నైజీరియాలోని కంకారాలో ప్రభుత్వ సైన్స్‌ సెకండరీ పాఠశాలపై దాడి చేసి... సాయుధులు అపహరించుకుపోయిన చిన్నారుల జాడ ఇప్పటికీ తెలియరాలేదు. మూడు రోజులు గడుస్తున్నా పిల్లల ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ చిన్నారులకు ఏమవుతుందోనని క్షణక్షణం భయందోళనకు గురవుతున్నారు. పిల్లలను కాపాడాలంటూ భద్రతా బలగాలను వేడుకుంటున్నారు.

బోకోహారం ఉగ్రవాదులే...
ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మద్‌ బుహారి సొంత రాష్ట్రంలో ఈ ఘటన జరగటం నైజీరియాలో ఉన్న భద్రతా పరమైన పరిస్థితికి అద్దం పడుతోంది. విద్యార్థులను కిడ్నాప్‌ చేసింది తామేనని బోకోహారం ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ మేరకు ఆ సంస్థ నాయకుడు అబూబకర్‌ ఓ ఆడియోనూ విడుదల చేశాడు. ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందనే పాఠశాలపై దాడి చేశామని తెలిపాడు. దాడి జరిగిన సమయంలో పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, అందులో 300 మందికి పైగా అపహరణకు గురయ్యారని కట్సినా రాష్ట్ర గవర్నర్‌ అమీను మస్సారీ వెల్లడించారు. దాడి జరిగిన సమయంలో ముష్కరులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, అదే సమయంలో చాలామంది విద్యార్థులు పాఠశాల కంచెను తొలగించి పారిపోయి తమను తాము రక్షించుకున్నారని ఆ రాష్ట్ర పోలీసు ప్రతినిధి తెలిపారు.

ట్రెండింగ్‌లో ..‘బ్రింగ్‌ బ్యాక్ అవర్‌ బాయ్స్‌’
చిన్నారులను రక్షించాలంటూ కంకారాలో ఆందోళన నిర్వహించగా, మరోవైపు ‘ బ్రింగ్‌బ్యాక్‌ అవర్‌ బాయ్స్‌’ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. విద్యార్థుల ఆచూకీ కోసం నైజీరియా ప్రభుత్వం గాలింపులు ముమ్మరం చేసింది. పోలీసులు, వైమానిక దళం, సైన్యం సంయుక్త ఆపరేషన్‌ ప్రారంభించాయి. జాంగో అటవీప్రాంతంలో ఉగ్రమూకల స్థావరాన్ని గుర్తించామని, అక్కడ ముష్కరులకు, సైన్యానికి భీకర పోరు జరిగిందని నైజీరియా అధ్యక్షుడు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులను సురక్షితంగా విడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.

ఇదే తొలిసారి కాదు...
నైజీరియాలో పాఠశాలలపై దాడి జరగటం ఇదే తొలిసారి కాదు. 2014లో బాలికల వసతి గృహం పై దాడిచేసి 270 మందిని ఉగ్రమూకలు అపహరించాయి. అందులో 100 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అదే ఏడాది ఓ కళాశాలపై జరిగిన దాడిలో 59 మంది విద్యార్థులు మరణించారు. నైజీరియాలో విద్యార్థుల కిడ్నాప్‌పై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఉగ్రదాడుల వల్ల 1100 మందికి పైగా మరణించారని వెల్లడించింది.


Read latest Nri News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని