జర్మనీలో అట్టహాసంగా ఎన్టీఆర్‌ శతజయంతి, మినీ మహానాడు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శతజయంతి, మినీ మహానాడు వేడుకలను జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో అట్టహాసంగా నిర్వహించారు.

Published : 30 May 2022 10:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శతజయంతి, మినీ మహానాడు వేడుకలను జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో అట్టహాసంగా నిర్వహించారు. తెదేపా-జర్మనీ ఆధ్వర్యంలో 2018 నుంచి నాలుగు మినీ మహానాడు కార్యక్రమాలు నిర్వహించగా మే 29న ఐదోసారి మినీ మహానాడు జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలిమ కూడితిపూడి గీసిన తారకరాముడి చిత్రపటం అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. వచ్చే ఏడాదిలో చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలను మినీ మహానాడులో ప్రవేశపెట్టారు.

మినీ మహానాడును ఉద్దేశించి తెదేపా సీనియర్‌ నేత, పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, తెదేపా జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న తిరునగరి వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. 2024లో ఏపీలో తెదేపా అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలని కోరారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జగన్‌ అరాచక పాలనను వివరించారు. జర్మనీ తెదేపా కోర్‌కమిటీ సభ్యులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అనంతరం సభ్యులతో పసుపు ప్రతిజ్ఞ చేయించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విదేశీవిద్య పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగాలు పొందిన విషయాన్ని నేతలు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 

తెదేపా జర్మనీ విభాగంలో ముఖ్యసభ్యులుగా ఉన్న శ్రీకాంత్‌, పవన్‌ కుర్రా, శివ, సుమంత్‌ కొర్రపాటి, అనిల్‌ మిక్కలినేని, టిట్టు మద్దిపట్ల, నరేశ్‌ కోనేరు, వంశీకృష్ణ దాసరి, వెంకట్‌ కాండ్ర తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మినీ మహానాడుకు జర్మనీలోని పలు ప్రాంతాల్లో ఉన్న తెదేపా కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని