లండన్‌లో వైభవంగా ‘తాల్‌’ ఉగాది వేడుకలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated : 02 May 2024 15:08 IST

లండన్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఏప్రిల్‌ 27న సత్తావిస్‌ పాటిదార్‌ సెంటర్‌, వెంబ్లి, లండన్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు భారీ సంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత డాక్టర్‌ చంద్రబోస్‌ హాజరై సందడి చేశారు. ఆయనతో పాటు వీఐపీలు ఫెల్తామ్‌, హెస్టన్‌ ఎంపీ సీమా మల్హోత్రా, హెచ్‌సీఐ లండన్‌ నుంచి నందితా సాహూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబోస్‌ తెలుగు భాష, సంస్కృతిని కీర్తిస్తూ ఆశువుగా పాటలు పాడి అలరించారు. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో కలిసి ఆస్కార్‌ అవార్డు అందుకోవడంపై తన అనుభవాలను పంచుకున్నారు. వేదికపై తన సతీమణి సుచిత్రతో కలిసి ఆయన తన కెరీర్‌పై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాల్‌ ధర్మకర్తల మండలి, శ్రీధర్‌ వనం, వంశీ మోహన్‌, సత్యేంద్ర పగడాల, రాములు దాసోజు, భారతి కందుకూరి, ఇతరులతో సహా మునుపటి బోర్డుల సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా చంద్రబోస్‌ మాట్లాడుతూ.. భారతదేశం వెలుపల తెలుగు భాష, సంస్కృతిని పెంపొందించేందుకు తాల్‌ ఎలా గౌరవిస్తుంది.. ఎలా పనిచేస్తుందనే అంశంపై నాటు నాటు శైలిలో తన ఆశువుగా పాటలతో ప్రశంసించారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్లౌసెస్టర్‌ ప్రదర్శించిన ప్రహ్లాద నాటకం అతిథులను మైమరిపించింది. క్లాసికల్‌, ఫ్యూజన్‌ నృత్య ప్రదర్శనలు అన్ని వయసుల వారిని ఆకట్టుకున్నాయి. గాయకులు దీపు, నూతన మోహన్‌ఆలపించిన పాటలకు ప్రేక్షకులు స్టెప్పులేసి ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమానికి వింధ్య విశాఖ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తాల్‌ కల్చర్‌ సెంటర్లకు చెందిన విద్యార్థులు టాలీవుడ్‌ మెలోడీలు, శాస్త్రీయ గానాలు, నృత్యాలు ప్రదర్శించారు. తాల్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈవెంట్‌లలో సహ ప్రదర్శనలు చేసే అవకాశం తమకు లభించిందని యూకేలోని ఇతర తెలుగు సంస్థల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ వేడుకల కోసం గత నాలుగు నెలలుగా అహర్నిశలు శ్రమించిన ధర్మకర్తల మండలి కిరణ్‌ కప్పెట, అనిల్‌ అనంతుల, శ్రీదేవి ఆలెద్దుల, అశోక్‌ మాడిశెట్టి, వెంకట్‌ నీల, రవి మోచర్ల, ఐటీ ఇంఛార్జి రాయ్‌ బొప్పనలకు ఛైర్మన్‌ రవి సబ్బ కృతజ్ఞతలు చెప్పారు. TAL ఉగాది 2024 కన్వీనర్ బాలాజీ కల్లూర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అనేక మంది వాలంటీర్లకు, దీర్ఘకాల మద్దతుదారులకు, కొత్త, పాత సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

మే 5 నుంచి తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు

తాల్ చైర్మన్ రవి సబ్బ మే 5న ప్రారంభమయ్యే తాల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు అందరినీ ఆహ్వానించారు. 14 వారాలపాటు ఈస్ట్ , వెస్ట్ లండన్‌లలో జరిగే ఈ పోటీల్లో 10  తేంస్ టైటిల్ కోసం పోటీ పడబోతున్నాయన్నారు. ఈవెంట్‌ను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, మద్దతుదారులు యాఫ్‌లో స్కోర్‌లను చూడొచ్చని తెలిపారు. TAL వార్షిక పత్రికను ఆవిష్కరించిన డాక్టర్ చంద్రబోస్‌.. సంపాదకులు రమేష్ కలవలను సత్కరించారు. మ్యాగజైన్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన సూర్య కందుకూరి.. ఈ ఏడాది ప్రచురణను నాణ్యతతో రూపొందించడానికి కృషి చేసిన సబ్ ఎడిటర్లు, పత్రిక బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని