సింగపూర్‌లో ఎన్నారైలతో ఘనంగా డా.రామ్‌మాధవ్‌ పుస్తక పరిచయ కార్యక్రమం

'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్‌లో ప్రవాస భారతీయులతో డా.రామ్‌మాధవ్‌ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది.

Published : 07 May 2024 19:08 IST

సింగపూర్‌: 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్‌లో ప్రవాస భారతీయులతో డా.రామ్‌మాధవ్‌ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. మే 4న జరిగిన ఈ పుస్తక పరిచయం, విశ్లేషణ కార్యక్రమంలో స్థానిక భారతీయ సంస్థల అధిపతులతో పాటు దాదాపు 100 మంది సింగపూర్ వాసులు పాల్గొన్నారు. ఈసందర్భంగా పుస్తక రచయిత, భాజపా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ..  భారతదేశం చుట్టూ అభివృద్ధి చెందుతున్న కథనంపై అంతర్‌ దృష్టి దృక్కోణాలను పంచుకున్నారు. భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందిస్తోన్న జవాబుదారీతనాన్ని వివరించారు. సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో యువకులు, విద్యావంతుల్లో పెరుగుతోన్న భాగస్వామ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ.. రామ్ మాధవ్‌తో, సింగపూర్‌లో తనకున్న వ్యక్తిగత పరిచయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ తన మిత్రులను కలుసుకోవడం కొత్త ఉత్సాహాన్నిచ్చిందని తెలిపారు.  అనంతరం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ..     పుస్తక సమీక్షను నిర్వహించే అవకాశం కల్పించిన రామ్ మాధవ్‌, సత్యమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్‌ విజయవంతం కావడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తంచేశారు. ఇందుకోసం అహర్నిశలు కృషి చేసిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామాంజినేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, నిర్మల్ కుమార్, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుంచి దీక్ష తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం చివరలో "ది ఇండియన్ రియాలిటీ " పుస్తకంపై  రామ్ మాధవ్‌తో సభ్యులంతా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అనంతరం నిర్వాహకులు రామ్ మాధవ్, సత్యమూర్తిని ఘనంగా సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని