Rahul Gandhi: 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. రాహుల్‌ 5 హామీలివే..

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు.

Published : 07 Mar 2024 16:36 IST

జైపుర్‌: వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) హామీ ఇచ్చారు. డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువతకు అప్రంటీస్‌షిప్‌ శిక్షణ ఇప్పించి వారిలో నైపుణ్యాన్ని కల్పిస్తామన్నారు. అప్రంటీస్‌షిప్‌ హక్కు చట్టాన్ని తీసుకురావడం ద్వారా 25 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారికి  శిక్షణ కల్పించి ప్రభుత్వ/ప్రైవేటురంగంలో ఉపాధి లభించేలా చూస్తామన్నారు. ఉద్యోగ నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్‌ గాంధీ సారథ్యంలో కొనసాగుతోన్న భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర గురువారం మధ్యప్రదేశ్‌ నుంచి రాజస్థాన్‌లోకి ప్రవేశించగా బాన్స్‌వారాలో సభ నిర్వహించారు.

బండారం బయటపడకూడదనే గడువు నాటకం: కాంగ్రెస్‌

ఈసందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. దేశంలో 30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రధాని నరేంద్రమోదీ గానీ, భాజపా గానీ వాటిని భర్తీ చేయడం లేదని ఆక్షేపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే తొలి పని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేయడమేనన్నారు. దేశంలో రైతులు పండించిన పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. గిగ్‌ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. అలాగే, స్టార్టప్‌ల కోసం రూ.5వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పంపిణీ చేస్తామన్నారు. యువత సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని.. దీనివల్ల దేశంలో లక్షలాది మందికి ఉపాధితో పాటు సంపద సృష్టి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని