Electoral bonds: బండారం బయటపడకూడదనే గడువు నాటకం: కాంగ్రెస్‌

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడికి మరింత గడువు కావాలని ఎస్‌బీఐ సుప్రీంకోర్టును కోరడాన్ని కాంగ్రెస్‌ తప్పుబట్టింది. ఎస్‌బీఐని ప్రభుత్వం రక్షణ కవచంగా వినియోగించుకుంటోందని ఆరోపించింది.

Updated : 07 Mar 2024 15:46 IST

దిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్లకు (Electoral bonds) సంబంధించి ఎస్‌బీఐకి (SBI) సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా వివరాలు వెల్లడించకపోవడంపై కాంగ్రెస్‌ స్పందించింది. వివరాల వెల్లడికి మరింత గడువు కావాలని ఎస్‌బీఐ కోరడాన్ని తప్పుబట్టింది. ఎస్‌బీఐని ప్రభుత్వం రక్షణ కవచంగా వినియోగించుకుంటోందని ఆరోపించింది. పార్టీకి నిధులు సమకూర్చిన కార్పొరేట్‌ మిత్రుల వివరాలు ప్రజలకు ఎక్కడ తెలిసిపోతాయోనని ప్రధాని మోదీ భయపడుతున్నారని విమర్శించింది. 

ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మార్చి 6లోగా ఈసీకి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించడానికి ఎస్‌బీఐని ఆదేశించింది. అయితే, బాండ్లు కొనుగోలు చేసినవారు, ఆ బాండ్లను రిడీమ్‌ చేసుకున్నవారి వివరాలు సరిపోల్చడానికి జూన్‌ 30 వరకు గడువు కావాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ మోదీ సర్కారు దోబూచులాట ఆడుతోందని దుయ్యబట్టారు.

ఎన్నికల బాండ్ల వివరాల వెల్లడికి ముగిసిన గడువు.. ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌

వివరాలు బయటపెట్టాలని ప్రజలు కోరుకుంటూ ఉంటే.. మోదీ ప్రభుత్వం దాక్కుంటోందని ఎద్దేవా చేశారు. అందుకు ఎస్‌బీఐ వంత పాడుతోందని దుయ్యబట్టారు. ఎస్‌బీఐకి మూడు వారాల పాటు సుప్రీంకోర్టు గడువు ఇస్తే.. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు గడువు కోరడం ఏంటని ప్రశ్నించారు. ‘‘వాస్తవానికి ఎలక్టోరల్‌ బాండ్లను రెండు కండీషన్లతో విక్రయిస్తారు. 1. బాండ్లను కొనుగోలు చేసినప్పుడే ఆయా శాఖలు కొనుగోలు చేసిన వారి వివరాలు సేకరిస్తాయి.  2.బాండ్లపై కనిపించని సీరియల్‌ నంబర్‌ ఉంటుంది. కాబట్టి ఎస్‌బీఐ వద్ద విరాళాలు ఇచ్చినవారు, అందుకున్న రాజకీయ పార్టీల వివరాలు కచ్చితంగా ఉంటాయి’’ అని రమేశ్‌ అన్నారు.

‘‘ఎలక్టోరల్‌ బాండ్లను కొనుగోలు చేసిన వారి వివరాలు బ్యాంకు వద్ద ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని 2017లో ఆర్థిక శాఖ పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కోరినప్పుడు ఆ సమాచారం దొరుకుతుందని తెలిపింది. 2018లో ఓ రాజకీయ పార్టీ ఎలక్టోరల్‌ బాండ్లను ఎన్‌క్యాష్‌ చేసుకోవడంలో ఇబ్బందిపడినప్పుడు ఇదే ఎస్‌బీఐ ఆర్థికశాఖ నుంచి అనుమతి తీసుకుని ఎన్‌క్యాష్‌మెంట్‌కు అవకాశం ఇచ్చింది’’ అని జైరాం రమేశ్‌ గుర్తు చేశారు. అతి తక్కువ సమయంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఎస్‌బీఐ వివరాల వెల్లడికి వెనకడుగు వేస్తోందని జైరాం రమేశ్‌ దుయ్యబట్టారు. ఒకప్పుడు ‘నేను తినను.. ఇంకొకరని తిననివ్వను’ అన్న మనిషి.. ఇప్పుడు ‘నేను చెప్పను.. చూపించను’ అంటున్నారని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని