మూడు రోజుల్లోనే మంత్రి పదవి ఊడింది

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Published : 20 Nov 2020 01:46 IST

ఆదిలోనే నీతీశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ రాజీనామా

పట్నా: రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విపక్ష పార్టీ ఆర్జేడీ అవినీతి కేసు నమోదు చేయడంతో విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌధరీ రాజీనామా చేయాల్సి వచ్చింది. భాగల్పూర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ  అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ శాస్త్రవేత్తల పోస్టుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2017లో తారాపూర్‌కు చెందిన ఈ జేడీయూ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. అప్పటి బిహార్ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్ అనుమతి ఇచ్చిన తరువాత ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అయితే ఛార్జిషీట్ మాత్రం దాఖలు చేయలేదు. 

కాగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మేవాలాల్‌ చౌధరీ మూడు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ప్రమాణ స్వీకారం చేసిన మొత్తం 14మంది మంత్రుల్లో ఎనిమిది మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. ఆర్‌జేడీ దీన్ని అదునుగా తీసుకొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అవినీతి ఆరోపణలున్న వ్యక్తికి మంత్రిపదవి కట్టబెట్టి మరింత దోపిడికి సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన ఇదివరకు ఓసారి పార్టీ నుంచి సస్పెండైన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ప్రతిపక్షాలనుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈనేపథ్యంలో మేవాలాల్‌ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కేసు నమోదు చేస్తే నేరం చేసినట్లు కాదని, చాలా మంది శాసనసభ్యులపై కేసులున్నాయని మేవాలాల్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దర్యాప్తు జరుగుతుందని, ఇంకా తేలకపోవడంతో ఈ విషయాన్ని తాను అఫిడవిట్‌లో పేర్కొనలేదని వెల్లడించారు. అలాగే తాను ఈ కేసులో ఇన్‌ఫార్మర్‌నని, నేరం చేయలేదని చెప్తూ..తేజస్వీ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. 

ప్రొటెం స్పీకర్‌గా జితిన్‌ రాం మాంఝీ:

ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ ఎంపికయ్యారు. ఈ నెల 23-24న రెండు రోజుల పాటు ప్రొటెం స్పీకర్‌గా మాంఝీ కొనసాగుతారని బిహార్‌ రాజ్‌భవన్‌ ప్రకటించింది. నవంబర్‌ 23 నుంచి ఐదు రోజులపాటు తొలి శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమయంలో కొత్త స్పీకర్‌ ఎన్నికయ్యే వరకు ఆయన ప్రొటెం స్పీకర్‌గా ఉండనున్నారు. హిందుస్థానీ అవామ్‌ మోర్చా(సెక్యులర్‌) పార్టీ వ్యవస్థాపకుడైన జితిన్‌ రాం మాంఝీ శాసనసభకు పలుసార్లు ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని