ఇంకెన్ని త్యాగాలు చేయాలి?

హిందీయేతర భాషల వారు ఇంకెన్ని త్యాగాలు చేయాలని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 24 Aug 2020 15:34 IST

ఆవేదన వ్యక్తం చేసిన కుమారస్వామి

ఇంటర్నెట్ డెస్క్‌: హిందీ అర్థం కానివారిని కార్యక్రమం వదిలి వెళ్లాల్సిందిగా ఓ ఉన్నతాధికారి ప్రభుత్వ కార్యక్రమంలో చెప్పడం చర్చనీయాంశమైంది. ఆయుష్‌ శాఖ ఇటీవల నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ శిక్షణా కార్యక్రమం సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. ఇది హిందీని బలవంతంగా రుద్దాలనే ఆర్ధరహితమైన చర్య అని.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి తీవ్రంగా ఖండించారు.

‘‘ఈ చర్య ఇంగ్లిష్‌ తెలియనందుకు విజ్ఞప్తా లేదా హిందీని తప్పనిసరి చేసే సిగ్గుమాలిన ఉత్సాహమా?’’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సమాఖ్యవాదం దేశ ఐక్యతకు తారకమంత్రమని.. దీనిలో ప్రతి భాషా సమాన భాగస్వామ్యం కలిగిఉందన్నారు. కాగా, హిందీ తెలియనందుకు శిక్షణను వదిలిపొమ్మనటం.. సమాఖ్య భావనకు, రాజ్యాంగానికి విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. హిందీ తెలియనందుకు కన్నడిగులతో సహా హిందీయేతర భాషల వారు ఇంకెన్ని త్యాగాలు చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

దక్షణ భారతదేశానికి చెందిన పలువురు గొప్ప నాయకులు ప్రధాని పదవిని అధిష్టించకుండా హిందీ రాజకీయాలు అడ్డుకున్నాయని కుమారస్వామి గతంలో ఆక్రోశం వెళ్లబుచ్చారు. ప్రభుత్వోద్యోగాల అర్హత పరీక్షలు ఇప్పటికీ హిందీ లేదా ఇంగ్లిష్‌లలో మాత్రమే నిర్వహించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాగా, హిందీలో మాట్లాడనందుకు తమిళనాడుకు చెందిన ఎంపీ కనిమొళికి కూడా ఇటీవల చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురుకావటం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని