ఆ మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్‌లో మహిళా మంత్రిపై ఓ సీనియర్‌ నేత అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్‌ మరోసారి చిక్కుల్లో పడింది.

Published : 20 Oct 2020 01:01 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో మహిళా మంత్రిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ మరోసారి చిక్కుల్లో పడింది. దాబ్రా నియోజకవర్గం ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్‌నాథ్‌ అక్కడి మహిళా మంత్రిని అభ్యంతరకర రీతిలో సంబోధించడంతో రాజకీయ దుమారం మొదలయ్యింది. కాంగ్రెస్ దిగ్గజ నేతల్లో ఒకరిగా ఉన్న‌ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల భాజపాతో పాటు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్, పలువురు నాయకులు రెండు గంటలపాటు మౌన దీక్ష చేపట్టారు. మహిళలు, దళితులను అగౌరవపరిచేలా కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీ నీచమైన మనస్తత్వానికి నిదర్శనమని శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దుయ్యబట్టారు.

నోటీసులు పంపిస్తాం..జాతీయ మహిళా కమిషన్‌

కమల్‌నాథ్‌ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన తీరును మహిళలు మండిపడుతున్నారు. తాజాగా దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ కూడా స్పందించింది. మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంపై కమల్‌నాథ్‌కు నోటీసులు పంపిస్తామని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ రేఖాశర్మ వెల్లడించారు. అంతేకాకుండా ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు.

లోక్‌సభలో అత్యంత సీనియర్‌ సభ్యుల్లో కమల్‌నాథ్‌ ఒకరు. ఇప్పటివరకు ఆయన తొమ్మిది సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అయితే, గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్‌ శాసనసభ స్థానం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ సమీకరణాలతో ప్రభుత్వం మారింది. ప్రస్తుతం అక్కడ 28అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని