Ajit Pawar: శరద్‌జీపై గౌరవం ఉన్నా.. కాలం మారింది: ఎమ్మెల్యేలకు అజిత్‌ పవార్‌ ఫోన్‌

మహారాష్ట్ర(Maharashtra)లో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎన్‌సీపీ( NCP)కి చెందిన రెండు వర్గాలు బుధవారం కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. 

Published : 05 Jul 2023 12:50 IST

ముంబయి: ఎన్‌సీపీ(NCP)లో తిరుగుబాటుతో శరద్‌ పవార్‌(Sharad Pawar), అజిత్‌ పవార్(Ajit Pawar) నేతృత్వంలోని రెండు వర్గాలు బుధవారం సమావేశం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో ఏ పక్షం బలం ఎంతో తేలనుంది. ఈ క్రమంలో ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాలని.. అజిత్ శిబిరం ఎన్‌సీపీ ఎమ్మెల్యేలను కోరింది.

ఈ కీలక సమావేశాలకు ముందే అజిత్ వర్గం ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిందని, తమతో చేతులు కలపాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ‘మాతో కలిసిరావడం వల్ల 2024 ఎన్నికల్లో మేలు జరుగుతుంది. మీ నియోజకవర్గంలో పూర్తికాని ప్రాజెక్టులకు.. నిధులు పొందేందుకు మేం సహకరిస్తాం. మీకు శరద్ పవార్‌పై గౌరవం ఉందని తెలుసు. కానీ, ఈ సమయంలో ఆచరణాత్మక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. మారిన కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి’ అని అజిత్‌ వర్గం నేతలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అలాగే వేదిక వద్దకు చేరుకుంటున్న నేతలతో అఫిడవిట్‌లో సంతకాలు చేయిస్తున్నట్లు సమాచారం. వీటిని ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. ఎన్‌సీపీ పేరు, గుర్తు కోసం పోరాడేందుకు ఇవి ఉపకరిస్తాయని భావిస్తున్నారు. 

విప్‌ జారీ చేసిన శరద్‌ పవార్‌..

మరోపక్క ముంబయిలోని వైబీ చవాన్‌ సెంటర్‌లో జరుగుతోన్న పార్టీ సమావేశానికి నేతలంతా హాజరుకావాలంటూ శరద్‌ పవార్ వర్గం విప్‌ జారీ చేసింది. ఇంకోపక్క ఎన్‌సీపీ కార్యవర్గ అధ్యక్షురాలు సుప్రియా సూలే(Supriya Sule) నేతలను ఉద్దేశించి ఒక వీడియోను విడుదల చేశారు. ‘భారీ సంఖ్యలో నేతలంతా బుధవారం జరిగే సమావేశానికి హాజరుకావాలని కోరుతున్నాను. ఈ క్లిష్ట సమయంలో 83 ఏళ్ల పోరాటయోధుడు మార్గనిర్దేశం చేస్తారు’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని