Punjab Polls: 101% గెలుపు మాదే..భాజపాతో ‘కెప్టెన్‌’ దోస్తీ ఫిక్స్‌!

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌తో తన సుదీర్ఘ బంధానికి......

Updated : 18 Dec 2021 15:21 IST

దిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్‌తో తన సుదీర్ఘ బంధానికి స్వస్తి చెప్పిన మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ భాజపాతో పొత్తు పెట్టుకొంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా భాజపా అగ్రనేతలతో వరుస భేటీలు అయిన కెప్టెన్‌.. ఈ ఎన్నికల్లో కమలనాథులతో కలిసి పంజాబ్‌ అధికార పీఠాన్ని దక్కించుకుంటామని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇరు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు ఖరారైంది.  ఈ మేరకు కేంద్రమంత్రి, పంజాబ్‌ భాజపా ఇంఛార్జి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో అమరీందర్‌ సింగ్‌ దిల్లీలో భేటీ అయ్యారు. అనంతరం నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు. 

తమ పొత్తు ఖరారైందని, ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్టు కెప్టెన్‌ స్పష్టంచేశారు. గెలుపు తమదేనన్నారు. సీట్ల పంపకాలపై తదుపరి చర్చలు కొనసాగుతాయని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న సీట్ల వారీగా కేటాయింపులు జరుగుతాయన్నారు. రాబోయే పంజాబ్‌ ఎన్నికల్లో 101శాతం గెలుపు తమదేనంటూ కెప్టెన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు.  ఏడు రౌండ్ల చర్చల తర్వాత ఈరోజు భాజపా, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. సీట్ల పంపకాలపై చర్చలు ఇకపై జరుగుతాయన్నారు. 

కొన్ని దశాబ్దాల పాటు పంజాబ్‌లో అకాలీదళ్‌కు జూనియర్‌ భాగస్వామిగా కొనసాగుతూ వచ్చిన భాజపా ఈసారి కెప్టెన్‌తో పొత్తు పెట్టుకోవడం గమనార్హం. మరికొద్ది నెలల్లో జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ స్థాపించిన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

Read latest Political News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని