UP Election 2022: యూపీలో ‘ఉచితాల’ వర్షం కురిపించిన భాజపా.. !

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే మేనిఫెస్టోతో భాజపా ముందుకొచ్చింది.

Updated : 08 Feb 2022 19:40 IST

 లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే మేనిఫెస్టోతో భాజపా ముందుకొచ్చింది. మంగళవారం రాజధాని లఖ్‌నవూ వేదికగా ‘లోక్‌ కల్యాణ్ సంకల్ప పత్ర’ పేరిట భాజపా అగ్రనేత అమిత్‌ షా యూపీ వాసులపై హామీల వర్షం కురిపించారు. మరీ ముఖ్యంగా అన్నదాతలు, నిరుద్యోగులు, మహిళా సంక్షేమంపై ఆ పార్టీ గురిపెట్టింది. రైతన్నల కోసం ఉచిత విద్యుత్‌, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ వరాలిచ్చింది. 

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘ఈ సంకల్ప పత్రాన్ని యూపీకి  చెందిన భాజపా బృందం సిద్ధం చేసింది. ఇది కేవలం ప్రకటన పత్రం కాదు. ఇది యూపీ ప్రభుత్వ తీర్మానం. 2017లో ఇచ్చిన 212 హామీల్లో 92 శాతం నేరవేర్చాం. మేం చెప్పింది చేస్తాం’ అని వెల్లడించారు. అలాగే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ మేనిఫెస్టోలో వివరించారు. యూపీ ఏడు దశల్లో పోలింగ్‌కు వెళ్లనుంది. మొదటి దశ పోలింగ్‌ (ఫిబ్రవరి 10)కు సమయం దగ్గరపడింది. 

భాజపా వాగ్దానాల చిట్టా ఇదే..

* సాగునీటి కోసం రైతులకు ఉచిత విద్యుత్ వెసులుబాటు. గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర ఇస్తామంటూ వాగ్దానం. 

* చక్కెర మిల్లుల పునరుద్ధరణకు రూ.5,000 కోట్లు. వచ్చే 15 ఏళ్లలో చెరుకు సంబంధిత బకాయిల మాఫీకి హామీ.  

* వచ్చే ఐదేళ్ల కాలంలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు. అందులో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం.

* ఉజ్వల యోజన పథకం కింద హోలీ, దీపావళి పండుగల వేళ మహిళలకు( దారిద్ర్య రేఖ దిగువన ఉండే కుటుంబాలు) రెండు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు. 60 ఏళ్లు పైబడిన మహిళలు ప్రజా రవాణాలో ఉచితంగా ప్రయాణించే అవకాశం. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌లో పెంపుదల.

* పట్టణ పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించేందుకు ‘మా అన్నపూర్ణ క్యాంటీన్’ ఏర్పాటు.

* కళాశాల విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్రవాహనాల పంపిణీ. కన్యా సుమంగళ యోజన కింద ఇచ్చే మొత్తం రూ.25 వేలకు పెంచుతూ హామీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని