
Aparna Yadav: ప్రత్యర్థి పార్టీలో చేరి.. ములాయం ఆశీస్సులు తీసుకున్న అపర్ణ..!
లఖ్‌నవూ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలు అపర్ణ యాదవ్ భాజపాలో చేరడం ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ నుంచి బయటకు వెళ్లిన ఆమె.. తాజాగా మామ ములాయం వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం ఆసక్తిగా మారింది. దానికి సంబంధించిన చిత్రాన్ని అపర్ణ నెట్టింట్లో షేర్ చేశారు. భాజపాలో చేరిన తర్వాత లఖ్‌నవూలో మామయ్య ఇంటికి వచ్చి, ఆశీస్సులు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
అపర్ణ భాజపాలో చేరడంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె భాజపాలో చేరకుండా ఆపేందుకు నేతాజీ (ములాయం) తీవ్రంగా ప్రయత్నించారని అఖిలేశ్ వెల్లడించారు. అంతేకాకుండా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలూ చేశారు. ఆమె పార్టీ మార్పు ఎస్పీ సిద్ధాంతాన్ని విస్తరించేందుకు దోహదం చేస్తుందన్నారు.
గురువారం ములాయం తోడల్లుడు ప్రమోద్ గుప్తా కూడా సైకిల్ దిగి కమలం గూటికి చేరారు. గతంలో ఎస్పీ శాసనసభ్యుడిగా పనిచేసిన ప్రమోద్.. ములాయం రెండో భార్య సాధనా గుప్తా సోదరి భర్త. ప్రమోద్ పార్టీని వీడుతూ.. అఖిలేశ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తండ్రి ములాయంను అఖిలేశ్ ఓ ఖైదీలా బంధించి ఉంచారని, నేతాజీని బహిరంగంగా మాట్లాడనీయడం లేదని ఆరోపించారు.