TDP Mahanadu: తెదేపాని అధికారంలోకి తెస్తేనే అందరికీ భవిష్యత్తు: బాలకృష్ణ

దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టోయ్.. అనే రీతిలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  విమర్శించారు.

Updated : 29 May 2022 06:41 IST

ఒంగోలు: దేశమంటే మనుషులు కాదోయ్.. దేశమంటే మట్టోయ్.. అనే రీతిలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  విమర్శించారు. మూడేళ్ల పాలనలో ధరలు పెరిగాయని.. అన్ని రకాల ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని మండిపడ్డారు. మహానాడు వేదికగా ఒంగోలులో నిర్వహించిన తెదేపా బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడారు.

‘‘పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లిన ఘనత పార్టీ అధినేత చంద్రబాబుది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించారు. ఐటీ రంగం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించిన ఘనత ఆయనది. తెదేపాని అధికారంలోకి తెస్తేనే ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ప్రజల ఆశీస్సులు కావాలి. తెలుగువారు కాని వారు కూడా తెలుగోళ్లను గుర్తు పట్టేలా చేసిన ఘనత తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ది. ఓటంటే నోటు కాదు. గుడినే కాదు గుడిలో లింగాన్ని కూడా మింగేసేవారు వైకాపాలో ఉన్నారు. నువ్వు-నేను కలిస్తే మనం.. మనం-మనం కలిస్తే జనం.. జనం-జనం కలిస్తే ప్రభంజనం అవుతుంది. ఇప్పుడు మహానాడుకు పసుపు సైన్యం ఓ ప్రభంజనంలా తరలి వచ్చింది. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని ఎన్టీఆర్ తపించేవారు. ఎన్టీఆర్ పేరు చెబితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గుర్తొస్తాయి’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని