బెంగాల్‌ పోరు: ‘గేమ్‌ ఛేంజర్’‌ జిల్లాల్లో హోరాహోరీ!

బెంగాల్‌ పోరులో గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తోన్న 54 స్థానాలపైనే భాజపా, తృణమూల్‌ గురిపెట్టాయి. మరో ఐదు దశల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ ఉత్తర బెంగాల్‌ జిల్లాలే భాజపా, తృణమూల్‌ గెలుపునకు కీలకంగా మారనున్నాయి.

Published : 10 Apr 2021 01:13 IST

ఉత్తర బెంగాల్‌పై భాజపా, తృణమూల్‌ కన్ను

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. వరుసగా మూడోసారి కూడా అధికారాన్ని చేపట్టాలని మమతా బెనర్జీ దృఢ నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భాజపా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌ పోరులో గేమ్‌ ఛేంజర్‌గా భావిస్తోన్న 54 స్థానాలపైనే భాజపా, తృణమూల్‌ గురిపెట్టాయి. మరో ఐదు దశల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ ఉత్తర బెంగాల్‌ జిల్లాలే భాజపా, తృణమూల్‌ గెలుపునకు కీలకంగా మారనున్నాయి.

కీలకంగా మారిన ఉత్తర బెంగాల్‌ జిల్లాలు

పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికే మూడు దశల్లో 91 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మరో ఐదు దశలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి ఏడు ఉత్తర బెంగాల్‌ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలు అత్యంత కీలకంగా మారాయి. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌, వామపక్షాలకు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాల్లో గిరిజన, మైనారిటీ వర్గాల ఓటర్లే ఎక్కువ. గత కొంతకాలంగా అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ పాగా వేసింది. కానీ, గడిచిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపా అత్యధిక సీట్లలో గెలుపొందింది. దీంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 54 స్థానాల్లో ఎక్కువ భాగం గెలుచుకునేందుకు అటు భాజపా, తృణమూల్ కాంగ్రెస్‌‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

సీట్లు కాపాడుకునే ప్రయత్నంలో తృణమూల్‌

2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అక్కడ 25 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ, 2019 లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో ఏడు స్థానాల్లో భాజపా విజయకేతనం ఎగరవేసింది. దీంతో ఆ ఏడు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ఉన్న దాదాపు 35 అసెంబ్లీ సీట్లు భాజపాకు అనుకూలంగా ఉన్నట్లు కాషాయ పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఎలాగైనా పట్టు కోల్పోకూడదని భావిస్తోన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ స్థానికంగా బలమైన నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది.  గోర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) నేత బిమల్‌ గురుంగ్‌ మద్దతును కూడగట్టుకుంది. అంతేకాకుండా అలీపుర్‌దౌర్‌ జిల్లాలో స్థానికంగా ఎస్టీ వర్గంలో ‘టైగర్‌’గా పేరున్న రాజేష్‌ లక్రా మద్దతును తృణమూల్‌ పొందింది. దీంతో ఎలాగైనా సిట్టింగ్‌ స్థానాలతో పాటు మరిన్ని సీట్లలో గెలుపొందాలని తీవ్రంగా కృషి చేస్తోంది.

వాటిపైనే కాషాయం కన్ను

కూచ్‌ బెహర్‌(9), జల్‌పయ్‌గురి(7), అలీపుర్‌దౌర్‌(5), డార్జిలింగ్(6), ఉత్తర దినాజ్‌పూర్‌(9), దక్షిణ దినాజ్‌పూర్‌(6), మాల్దా(12) జిల్లాల్లో.. కొన్నేళ్లుగా ప్రత్యేక రాష్ట్రంతో పాటు ఇతర హక్కుల కోసం ఉద్యమాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ ప్రచారంతో దూసుకెళ్లిన కాషాయ పార్టీ అక్కడి ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా స్థానికంగా మంచి పేరున్న నాయకుల మద్దతు కూడగట్టుకుంది. ఇక ప్రత్యేక రాష్ట్రం కోసం డార్జిలింగ్‌ వాసులు చేపట్టిన ఆందోళనలపై తృణమూల్‌ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం కూడా భాజపాకు కలిసొచ్చింది. దీంతో మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు పొందగలిగింది. ఇక అలీపుర్‌దౌర్‌, జల్పయ్‌గురి ప్రాంతాలతో పాటు మైనారిటీలు ఎక్కువగా ఉండే దినాజ్‌పూర్‌, మల్దా ప్రాంతాల్లో అక్రమ చొరబాట్లను ప్రశ్నిస్తూ భాజపా అక్కడివారికి చేరువైంది. జీజేఎం నేత తృణమూల్‌కు మద్దతిస్తోన్న నేపథ్యంలో.. గుర్ఖా వర్గంలో మరో కీలక నేతగా ఉన్న బినయ్‌ తమాంగ్‌ను భాజపా తమవైపు తిప్పుకుంది. ఇలా ఉత్తర బెంగాల్‌లో పార్లమెంట్‌ సీట్ల మాదిరిగానే అసెంబ్లీ సీట్లన్నీ కైవసం చేసుకోవాలని చూస్తోంది.

ఓట్ల చీలికపైనే తృణమూల్ ఆశలు

మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను భాజపా గెలుచుకోవడం తృణమూల్‌కు ఇబ్బందిగా మారింది. ఆయా స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ సీట్లలో ఓటర్లు ఈసారి భాజపా వైపే మొగ్గుచూపితే ఇబ్బంది తప్పదని తృణమూల్‌ భావిస్తోంది. అయితే, ఒకప్పుడు కాంగ్రెస్‌, వామపక్షాల కూటమికి కంచుకోటగా ఉన్న ఆ ప్రాంతంలో ఈసారి అదే కూటమి ఓట్లను చీలుస్తుందని తృణమూల్‌ ఆశతో వేచిచూస్తోంది. జీజేఎం నేత గురుంగ్‌ తమకు మద్దతు ఇవ్వడం, గత ప్రాభవాన్ని చాటేందుకు కాంగ్రెస్‌-వామపక్ష కూటమి చేస్తోన్న ప్రయత్నాలపైనే ఇక్కడ భాజపా గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు బిశ్వాంత్‌ చక్రవర్తి విశ్లేషిస్తున్నారు. ఇలా వచ్చే ఐదు దశల్లో జరగనున్న అసెంబ్లీ స్థానాలపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌లు గురిపెట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని