
Chhath festival: కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసన.. భాజపా ఎంపీకి గాయాలు!
దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఛాత్ వేడుకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ భాజపా నిరసనకు దిగింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టారు. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భాజపా ఎంపీ మనోజ్ తివారీకి గాయమైంది. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆయన చెవి భాగంలో గాయమైనట్టు భాజపా నేత నీల్‌కాంత్ బక్షి తెలిపారు. నగరంలో బిహార్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, ఝార్ఖండ్‌ల లక్షలాది మంది ప్రజలు జరుపుకొనే ఈ వేడుకపై నిషేధం విధించడాన్ని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, ఇతర నేతలు ఖండించారు.
కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాల్లో బహిరంగంగా ఛాత్ వేడుకలపై నిషేధం విధిస్తూ దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీచేసింది. అయితే, దీనిపై భాజపా నేత ఆదేశ్ గుప్తా నిన్న మాట్లాడుతూ.. ఛాత్ వేడుకలను ఘనంగా నిర్వహించి తీరతామని ప్రకటించారు. భాజపా పాలిత మున్సిపల్ కార్పొరేషన్లలో ఇందుకోసం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మరోవైపు, ఛాత్ వేడుకలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డీడీఎంఏకు ప్రతిపాదన పంపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రజల ఆరోగ్యం, క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొనే బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ వేడుకలు జరుపుకోవడంపై నిషేధం విధించినట్టు సీఎం కేజ్రీవాల్ ఇటీవల తెలిపారు.
ఇవీ చదవండి
Advertisement