Telangana News: ప్రజా స్పందన చూడలేకే మాపై తెరాస దాడులు: డీకే అరుణ

రాష్ట్రంలో తెరాస నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాసంగ్రామ యాత్ర సాగుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Updated : 18 Apr 2022 15:36 IST

వేముల: రాష్ట్రంలో తెరాస నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాసంగ్రామ యాత్ర సాగుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. భాజపా తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహిస్తున్న ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’లో ఇవాళ స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద తెరాస శ్రేణులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు.

పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక తెరాస దాడులు చేస్తోందని ఆమె ఆరోపించారు. భాజపా నేతలపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై తెరాస కార్యకర్తలు రాళ్ల దాడులు చేస్తున్నారన్నారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. తెరాస శ్రేణులను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ శ్రేణుల దాడిలో తమ ఐదు వాహనాలు దెబ్బతిన్నాయని చెప్పారు. తెరాస శ్రేణుల దాడిలో రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటని నిలదీశారు. పాదయాత్రలో పేదలు తమ కష్టాలు, బాధలను ఏకరవు పెడుతున్నారని డీకే అరుణ చెప్పారు. తెరాస నేతలు తమ శ్రేణులకు మద్యం తాగించి మాపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. సంయమనం పాటించాలని తమ కార్యకర్తలను కోరుతున్నట్లు చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుంటోందని ఆమె ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని