ఆ గాయం దీదీని ఎప్పటికీ వెంటాడుతుంది: షా

బెంగాల్‌లో ఇటీవల టీఎంసీ నేతల దాడిలో గాయాల పాలైన భాజపా కార్యకర్త తల్లి మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు.

Published : 30 Mar 2021 01:07 IST

దిల్లీ: బెంగాల్‌లో ఇటీవల టీఎంసీ నేతల దాడిలో గాయాల పాలైన భాజపా కార్యకర్త తల్లి మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి తగిలిన గాయం మమతా బెనర్జీని ఎప్పటికీ వెంటాడుతుందని మండిపడ్డారు. ఈ మేరకు షా ట్విట్‌ ద్వారా మృతురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు.‘టీఎంసీ కార్యకర్తల చేతిలో దాడికి గురై బెంగాల్‌ కుమార్తె శోభా మజుందార్‌(84) మరణించడం ఆవేదనకు గురిచేసింది. ఆ కుటుంబానికి కలిగిన గాయం మమతా బెనర్జీని ఎల్లకాలం వెంటాడుతుంది. బెంగాల్‌ ప్రజలు హింసకు తావు లేని రాష్ట్రం కోసం, మహిళలకు రక్షణ కల్పించే రాష్ట్రం కోసం పోరాటం చేయాలి’ అని షా ట్వీట్‌లో పేర్కొన్నారు. 

భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఈ విషయంపై ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘శోభా మజుందార్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. కేవలం తన కుమారుడు భాజపా కార్యకర్త కావడం వల్లే ఈ రోజు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె త్యాగం ఎల్లప్పటికీ నిలిచిపోతుంది. బెంగాల్‌లో తల్లులు, సోదరీమణుల సంరక్షణకు భాజపా పోరాడుతుంది’ అని నడ్డా తెలిపారు. 

గతనెలలో బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా నింతా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గోపాల్‌ మజుందార్‌ అనే తమ కార్యకర్త ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. తమ కార్యకర్తపై, 84 ఏళ్ల వయసున్న అతడి తల్లిపై టీఎంసీ కార్యకర్తలు దారుణంగా దాడికి పాల్పడ్డారని మండిపడింది. కాగా, ఈ ఆరోపణల్ని టీఎంసీ పార్టీ ఖండించింది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు