BRS: తెరాస.. ఇకపై భారత్‌ రాష్ట్ర సమితి: తీర్మానంపై సంతకం చేసిన కేసీఆర్‌

తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Updated : 05 Oct 2022 15:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని  జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై తెరాస ‘భారత్‌ రాష్ట్ర సమితి’ (భారాస)గా మారనుంది. ఈ మేరకు పేరును మారుస్తూ తెరాస అధినేత ప్రతిపాదించిన ఏక వాక్య తీర్మానానికి సభ్యులు మద్దతు తెలిపారు.

అనంతరం ఆ తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేశారు. ఆ తర్వాత తీర్మానాన్ని ఆయన చదివి వినిపించి ‘భారత్‌ రాష్ట్ర సమితి’ పేరును ప్రకటించారు. పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగంలో సవరణ చేసినట్లు చెప్పారు. కేసీఆర్ పార్టీ పేరు మార్పును ప్రకటించగానే సమావేశంలో సభ్యులంతా చప్పట్లతో మద్దతు పలికారు. భారాస పేరు ప్రకటించిన అనంతరం కేసీఆర్‌ను జేడీఎస్‌ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత శాలువాతో కుమారస్వామి ఆయన్ను సత్కరించారు. 

కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ

సమావేశం అనంతరం పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం లేఖ రాశారు. పార్టీ రాజ్యాంగాన్ని సవరించి తెరాసను ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా మార్చినట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానం చేశామని.. దీన్ని ఆమోదించాలని ఈసీని కేసీఆర్‌ కోరారు. 

రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల సంబురాలు

తెరాసను భారత్‌ రాష్ట్ర సమితిగా కేసీఆర్‌ ప్రకటించగానే తెలంగాణ వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. తెలంగాణ భవన్‌తో పాటు జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల ముందు బాణసంచా కాల్చారు. డప్పు వాయిద్యాలతో ఆనందోత్సాల మధ్య నేతలు, కార్యకర్తలు నృత్యాలు చేశారు. దేశంలో గుణాత్మక మార్పునకు భారాస శ్రీకారం చుట్టబోతోందని ఈ సందర్భంగా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నాయకత్వానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని