AP 3 Capitals: సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టిన బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సోమవారం అసెంబ్లీలో సీఆర్‌డీఏ(CRDA) రద్దు ఉపసంహరణ బిల్లును

Updated : 22 Nov 2021 17:03 IST

అమరావతి: అమరావతి సీఆర్‌డీఏ(CRDA) చట్టాన్ని పునరుద్ధరిస్తూ సోమవారం ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టింది. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు  శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్‌డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ, ఏఎంఆర్డీఏకు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్‌డీఏకు బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం తాజా బిల్లులో ప్రస్తావించింది. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్టు శాసనసభకు ఇచ్చిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే సీఆర్‌డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయి. భాషా ప్రాతిపదిక ఏర్పాటైన రాష్ట్రం మళ్లీ 2014లో రెండు భాగాలుగా విడిపోయింది. భారతదేశంలో గుర్తింపబడిన ఆరు క్లాసికల్‌ లాంగ్వేజెస్‌లో తెలుగు ఒకటి. అంతేకాదు, భారత్‌లో అత్యధికమంది మాట్లాడే భాషల్లో నాలుగో స్థానంలో ఉంది. ఇది తెలుగు భాషకు ఉన్న కీర్తి. తెలంగాణవాదం పుట్టినప్పుడు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. వెనుకబడి ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలను శ్రీకృష్ణ కమిటీ గుర్తించింది. ఈ రెండు ప్రాంతాలతో పోలిస్తే, హైదరాబాద్‌ రాజధానిగా కలిగిన తెలంగాణ అభివృద్ధిలో ఒక మెట్టు పైనే ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత కేంద్రం శివరామకృష్ణగారితో ఒక కమిటీ వేశారు.  క్యాన్సర్‌తో బాధపడుతూనే ఆయన ఏపీలో 13 జిల్లాలు ఉంటే 10 జిల్లాల్లో స్వయంగా పర్యటించి నివేదిక సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌లో ఉత్తమమైన రాజధానిగా నిలిచే ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న ఆ కమిటీకి ఇచ్చి ముఖ్యమైన అసైన్‌మెంట్‌. శివరామకృష్ణ ఇచ్చిన నివేదికలో రాజధానిపై ఒక ప్రత్యేక ప్రాంతమని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణ నుంచి విడిపోవటం వల్ల ఎదురైన చేదు అనుభవాలు భవిష్యత్‌లో ఎదురుకాకుండా ఉండాలంటే పాలనలో వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రా, రాయలసీమతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాలో ఆయన వివరించారు. ‘కృష్ణా-గుంటూరు డెల్టాలో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. ఇక్కడి భూములు చాలా విలువ కలిగినవి. ఇక్కడ ఏదైనా నిర్మించాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పాలన వ్యవహారాలు అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉండాలి’ అని శివరామకృష్ణకమిటీ చెప్పింది’’ అని బుగ్గన సభలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని