Andhra News: ‘అప్పర్‌భద్ర’ను జగన్‌, కేసీఆర్‌ క్రికెట్‌ మ్యాచ్‌లా చూస్తున్నారు: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

అప్పర్‌భద్ర ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల సీఎంలు అత్యవసర భేటీ ఏర్పాటు చేయాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని.. దీని నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కోరారు.

Updated : 25 Feb 2023 16:34 IST

కర్నూలు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్‌భద్ర ప్రాజెక్టు (Upper Bhadra project) నిర్మాణంతో రాయలసీమ ఎడారిగా మారుతుందని రాయలసీమ స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (Byreddy rajasekhar reddy) అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాల నీటి వాటాకు తీవ్ర అన్యాయం వాటిల్లుంతోందని ఆరోపించారు. అప్పర్‌భద్ర నిర్మాణానికి వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం నుంచి పాదయాత్ర చేపట్టారు. రాజోలి ఆనకట్ట నుంచి ఆదోని వరకు 3 రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. 

ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. అప్పర్‌భద్ర నిర్మాణాన్ని ఏపీ సీఎం జగన్‌ (CM Jagan), తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR) క్రికెట్‌ మ్యాచ్‌లా చూస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు విషయమై తెలుగు రాష్ట్రాల సీఎంలు అత్యవసర భేటీ ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఆపాలని కోరారు. రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు అప్పర్‌భద్రను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ డిమాండ్ లేవనెత్తుతామని హెచ్చరించారు. దీనిపై రాయలసీమ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరించి కేంద్రానికి పంపిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని