Andhra News: చంద్రబాబు ఏలూరు పర్యటనలో ఆసక్తికర ఘటన

పోలవరంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పడు రూ.800 కోట్లు అదనపు భారం మోపారని మండిపడ్డారు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయి...

Published : 21 Apr 2022 01:52 IST

అగిరిపల్లి: పోలవరంలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని.. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పడు రూ.800 కోట్లు అదనపు భారం మోపారని మండిపడ్డారు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయి 3 సీజన్లు దాటినా పట్టించుకోలేదని విమర్శించారు. పోలవరం కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం నక్కల గొల్లగూడెంలో నిర్వహించిన గ్రామ సభలో చంద్రబాబు మాట్లాడారు. సన్న బియ్యం ఇస్తానంటూ ఉన్న బియ్యాన్ని పోగొడుతున్నారన్నారు. సీఎం జగన్‌ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటమని స్పష్టం చేశారు. అప్పులు ఎంత తెచ్చారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు పాదయాత్ర సాగింది. తెలుగుదేశం అధినేత రాకతో అడవినెక్కలం, నెక్కలం గొల్లగుడెం గ్రామాలు పసుపు మయంగా మారాయి. రావిచర్ల సర్పంచి కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 73 కేజీలు కేకుని చంద్రబాబు కట్ చేశారు. చంద్రబాబుని తెలుగుదేశం శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గ్రామాల్లో పేదల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రికి గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

గ్రామ సభలో ఆసక్తికర ఘటన..

నక్కల గొల్లగూడెంలో నిర్వహించిన గ్రామ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాట్లాడే అవకాశం ఇవ్వాలని గ్రామసభకు వచ్చిన వైకాపా నేత కాజా రాంబాబు కోరారు. ‘‘ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమారుడు అవినీతికి పాల్పడ్డారు. గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతాను. ఎమ్మెల్యే కుమారుడి అవినీతిపై పోరుకు మద్దతు ఇవ్వాలి’’ అని రాంబాబు కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. రాంబాబు పోరాటాన్ని పార్టీలకు అతీతంగా చూడాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని