Pawan Kalyan: మరోసారి వైకాపా వస్తే రాయలసీమలో ఇంకేమీ మిగలదు: పవన్‌

రాయలసీమ ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 07 Mar 2024 17:39 IST

మంగళగిరి: రాయలసీమ ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజారాజ్యం పార్టీ నుంచి శ్రీనివాసులు నాకు తెలుసు. నాతో కలిసి ప్రయాణిస్తానని చెప్పారు. రాయలసీమ బానిస సంకెళ్లలో ఉండిపోయింది. చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డితో నాకు విభేదాలు లేవు. కానీ, సీమలో కొందరు నేతలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మరోసారి వైకాపా వస్తే ఈ ప్రాంతంలో ఇంకేమీ మిగలదు. ఉపాధి కోసం చాలా మంది అక్కడి నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లిపోతున్నారు. భయం వదిలేస్తేనే పరిస్థితులు మారతాయి. జగన్‌ గుంపు నుంచి సీమను రక్షించుకోవాలి. వైకాపా నేతలు తిరుపతిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు.

కర్నూలులో సుగాలి ప్రీతి హత్య నన్ను కలచివేసింది. జనసేన ఒత్తిడి వల్లే ఆ కేసును సీబీఐకి ఇచ్చారు. నాకు వ్యక్తిగతంగా పలుకుబడి, డబ్బులు ఉన్నాయి, పెద్ద కుటుంబం ఉంది. కానీ, అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానంటే తెలుగు జాతి నా కుటుంబం అనుకున్నా. ఈసారి అణగారిన వర్గాలకు అండగా ఉందాం. చిన్న కులాల్లో ఐక్యత లేక జగన్‌కు ఊడిగం చేస్తున్నారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా పోలీసులు మా ఆవరణలోకి వచ్చారు. రాజకీయాల్లో ఇదంతా సహజం అంటే కుదరదు. ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవించాలి.. లేదంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిని గుర్తు పెట్టుకుంటాం. వైకాపాకు కొమ్ముకాసే పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండాలి’’ అని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని