Cm Jagan: గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలిశారు. దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ

Updated : 06 Jun 2022 20:21 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలిశారు. దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ అంశాలపై వారు చర్చించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరును వ్యతిరేకిస్తూ మే 24న జరిగిన ఆందోళనలపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోనసీమ ఘటనలపై ఇప్పటికే కాంగ్రెస్ సహా పలువురు ప్రజా సంఘాల నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అమలాపురం అల్లర్ల విషయంలో గవర్నర్‌కు పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన దృష్ట్యా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను తగులబెట్టారని.. కోనసీమ ఆందోళనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలుస్తోంది. కోనసీమకు అంబేడ్కర్ పేరు కొనసాగించాలా లేదా అనే అంశంపైనా సమాలోచనలు జరిపినట్లు తెలిసింది.

20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు!

ఈనెల 20వ తేదీ నుంచి వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. ఇందుక సంబంధించి శాసనసభ నిర్వహణ తేదీలు, సహా సభలో పెట్టే పలు కీలక బిల్లులపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతి రాజీనామా చేయనున్నారు. ఈ స్థానంలో కోలగట్ల వీరభద్ర స్వామిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికపైనా గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు తెలిసింది. సీఎం దిల్లీ పర్యటన, తాజా రాజకీయ పరిణామాలపైనా గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని