Priyanka: లక్ష ఉద్యోగాలు.. OPS పునరుద్ధరణ: ‘హిమాచల్‌’లో ప్రియాంక హామీల వర్షం

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(Himachal Pradesh Assembly polls) సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం మరింత జోరుగా కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల అగ్రనేతలు పరస్పర విమర్శలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Published : 05 Nov 2022 01:47 IST

కంగ్రా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(Himachal Pradesh Assembly polls) సమీపిస్తున్న వేళ ఎన్నికల ప్రచారం మరింత జోరుగా కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల అగ్రనేతలు పరస్పర విమర్శలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi) శుక్రవారం కంగ్రాలో ఎన్నికల ప్రచారంలో హిమాచల్‌ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తోన్న మాదకద్రవ్యాల మహమ్మారిపైనా తమ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్ని నిర్మించనున్నట్టు హామీ ఇచ్చారు.

భాజపా సర్కార్‌పై విమర్శలు

హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భాజపా సర్కార్‌పై తీవ్రస్థాయిలో ప్రియాంక విరుచుకుపడ్డారు. భాజపా హయాంలో హిమాచల్‌ ప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. 63వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో మాదిరిగానే తమను గెలిపిస్తే హిమాచల్‌ప్రదేశ్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. ‘‘కాంగ్రెస్‌ లక్ష ఉద్యోగాలు సృష్టిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ ఇక్కడే కూర్చున్నారు. ఆయన గత మూడేళ్లలో 5లక్షల ఉద్యోగాలు కల్పించారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా 1.30లక్షల ఉద్యోగాలు కల్పించింది. ఈరోజు ఛత్తీగఢ్‌లో నిరుద్యోగిత రేటు తక్కువగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తే.. తొలి కేబినెట్‌ సమావేశంలోనే లక్ష ఉద్యోగాల కల్పించే అంశంతో పాటు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించే అంశంపై నిర్ణయం తీసుకుంటాం. అలాగే, ఐదేళ్లలో 5లక్షల ఉద్యోగాలు కల్పిచేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాం. రాష్ట్రంలో ప్రతి మహిళలకూ నెలనెలా  ‘హర్‌ఘర్‌ లక్ష్మీ యోజన’ కింద రూ.1500ల చొప్పున ఆర్థిక సాయంగా అందజేస్తాం’’ అని హామీ ఇచ్చారు. 

లక్ష ఉద్యోగాలు కల్పిస్తామంటుంటే భాజపా సాధ్యం కాదంటోందని.. కానీ,  దేశ ఆస్తులు, పీఎస్‌యూలను తమ కార్పొరేట్‌ మిత్రులకు విక్రయించడం మాత్రం వాళ్లకు సాధ్యమవుతుందంటూ ధ్వజమెత్తారు. బడా కార్పొరేట్లకు కేంద్రం రూ.10లక్షల కోట్ల మేర రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. వారికి రుణాలు మాఫీ చేసేందుకు కేంద్రం వద్ద డబ్బు ఉంది గానీ.. కార్మికులకు పింఛను ఇవ్వడానికి ఉండదని విమర్శించారు. ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్న ప్రియాంక గాంధీ ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారన్నారు. నవంబర్‌ 12న ఒకే విడతలో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్‌ 8న ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని