196 నుంచి 19కి తగ్గిన కాంగ్రెస్‌!

శతబ్దాల ఘన చరిత గల కాంగ్రెస్‌ పూర్వవైభవం తెచ్చుకోవడంలో విఫలమవుతూనే ఉంది. ఉత్తరాది రాష్ట్రం బిహార్‌లో 30ఏళ్ల నుంచి వరుసగా మరోసారి 30లోపు సీట్లకే పరిమితమైంది. నాయకత్వ లోపం, వరుస వైఫల్యాలు

Updated : 11 Nov 2020 11:15 IST

135 ఏళ్లకు పైగా ఘన చరిత గల కాంగ్రెస్‌ పూర్వవైభవం తెచ్చుకోవడంలో విఫలమవుతూనే ఉంది. కీలక రాష్ట్రమైన బిహార్‌ను ఏకధాటిగా పాలించిన కాంగ్రెస్‌ గత మూడు దశాబ్దాల నుంచి అధికారానికి దూరం కావడమే కాకుండా 30లోపు సీట్లకే పరిమితం కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లోనూ 19 సీట్లు గెలుచుకుంది. నాయకత్వ లోపం, వరుస వైఫల్యాలు, సమస్యలపై  గళమెత్తే నాయకత్వం లేకపోవడం హస్తం పార్టీకి శాపంగా మారుతున్నాయి. ఫలితంగా పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పట్టు కోల్పోవాల్సి వస్తోంది. 

బిహార్‌లో మారని తీరు..

1990 వరకు బిహార్‌ రాజకీయాలను డామినేట్‌ చేసిన కాంగ్రెస్‌.. ఆ తర్వాత నుంచి తన ప్రభ కోల్పోతూ వస్తోంది. 1985లో 196 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన హస్తం పార్టీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 71 సీట్లు మాత్రమే సాధించగలిగింది. 1989లో జనతాదళ్‌ నేత, అప్పటి ప్రధాని వీపీ సింగ్‌ చేపట్టిన మండల్‌ అస్త్రం బిహార్‌లో కాంగ్రెస్‌ను దారుణంగా దెబ్బకొట్టింది. మండల్‌ విప్లవంతో అనతి కాలంలో కాంగ్రెస్‌.. ఓబీసీ, ఉన్నతవర్గాల ఓట్లను కోల్పోయింది. దీంతో ఓటు షేరు దారుణంగా పడిపోయింది. 1995లో కేవలం 29 స్థానాల్లో మాత్రమే గెలిచిన హస్తం పార్టీ.. అప్పటి నుంచి తన బలాన్ని పెంచుకోలేకపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓటు షేరు కూడా  కేవలం పదిశాతంలోపునకే పడిపోయింది. 2015 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కాస్త పుంజుకున్నట్టే కనిపించింది. ఆ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేసి 27 చోట్ల విజయం సాధించింది. అదే నమ్మకంతో ఈ సారి 70 నియోజకవర్గాల్లో బరిలోకి దిగింది. అయితే ఈ సారి కూడా కాంగ్రెస్‌కు నిరాశే ఎదురైంది. 19 సీట్లు మాత్రమే దక్కించుకుంది. 

నాయకుడు లేని నావలా..

కాంగ్రెస్‌కు నాయకత్వ లోపం ప్రధాన సమస్యగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయిన రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో పార్టీ పగ్గాలు మళ్లీ సోనియాగాంధీకే అప్పగించారు. అయితే ఒక్క ఓటమికే రాహుల్‌ పదవిని వదలేయడంతో ఆయనపై కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోనియా తాత్కాలిక అధ్యక్షురాలు మాత్రమే. వచ్చే ఏడాది పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమయంలో బిహార్‌ ఎన్నికలు కాంగ్రెస్‌కు పరీక్షగా మారాయి. అయితే ఇప్పుడు కూడా రాహుల్‌ గాంధీ నాయకత్వంపై ఆసక్తిగా ఉన్నట్లు కన్పించలేదు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ అయినప్పటికీ ప్రచారంలో రాహుల్‌ పెద్దగా కన్పించలేదు. అలాగే ప్రియాంకాగాంధీ, సోనియాగాంధీ కూడా బిహార్‌ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు.

కూటములే ఆధారం..

కేంద్రంలో మాదిరిగానే బిహార్‌లోనూ కాంగ్రెస్‌ స్థానికంగా పెద్దగా పట్టులేదు. క్షేత్రస్థాయిలో కీలక నేతలు లేకపోవడంతో ఆ పార్టీ ఈ సారి కూడా కూటమికే మొగ్గుచూపింది. గతంలో ఆర్జేడీ, జేడీయూతో కలిసి మహాకూటమిలో భాగస్వామి అయినట్లుగానే.. తాజా ఎన్నికల్లోనూ ఆర్జేడీ, వామపక్షాలతో కలిసి మహాగట్ బంధన్‌గా ఏర్పడింది. ఈ కూటముల్లో కాంగ్రెస్‌కు పెద్దగా ప్రాధాన్యం దక్కట్లేదు. అయితే రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించాలంటే హస్తం పార్టీకి కూటమిపై ఆధారపడక తప్పట్లేదు. ఒంటరిపోరు చేసేందుకు కాంగ్రెస్‌కు స్థానికంగా ప్రాబల్యం లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. బిహార్‌లో మొత్తం 243 సీట్లు ఉండగా.. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈసారి కాంగ్రెస్‌ 70 స్థానాల్లో బరిలోకి దిగింది. కానీ ఇందులో సగం సీట్లు కూడా గెల్చుకోలేకపోవడం గమనార్హం. 

పోరు.. సామాజిక మాధ్యమాల్లోనే..

ప్రజాసమస్యలపై పోరాడటంలోనూ కాంగ్రెస్‌ వెనుకబడే ఉంటోంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎన్నికల సమయంలో తప్ప ఇంకెప్పుడూ కనబడరనే అపవాదు ఉండనే ఉంది. ఇక కేంద్ర స్థాయిలో రాహుల్‌ గాంధీ లాంటి కీలక నేతలు కూడా సమస్యలపై నేరుగా పోరాడటం చాలా అరుదు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏకరువు పెట్టడం మినహా ప్రజల్లోకి వచ్చి ఆందోళన చేయడం తక్కువే. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ ఖేటీ బచావో యాత్ర చేపట్టారు. అయితే ఆ ఆందోళన కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక ఎన్నికల రాష్ట్రమైన బిహార్‌లోని స్థానిక సమస్యలపై కూడా హస్తం పార్టీ పెద్దగా గళం విప్పలేదు. కొవిడ్‌పై ప్రభుత్వం ఎదుర్కొన్న విమర్శలను కాంగ్రెస్‌ ప్రచారాస్త్రంగా మలుచుకోవడంలో విఫలైమంది. 

యువతరానికి ప్రాధాన్యత అంతంతమాత్రమే

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో యువతరాన్ని ముందుకు తీసుకురావాలని రాహుల్‌గాంధీ భావించారు. ఇందులో భాగంగానే ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోని సభ్యులందరినీ రాజీనామా చేయాలని కోరారు. అయితే రాహుల్‌ మినహా ఏ ఒక్కరూ ఓటమిని అంగీకరించి రాజీనామా చేయకపోవడం గమనార్హం. అదే సమయంలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అప్పుడు కూడా కాంగ్రెస్‌ యువ నేతలవైపే మొగ్గుచూపినా.. సీనియర్లు ఆయన మాట నెగ్గనివ్వలేదు. అందుకు ఫలితంగానే మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియాను పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. రాజస్థాన్‌లోనూ సచిన్‌ పైలట్‌ తిరుగుబావుటా ఎగరేయగా.. అధిష్ఠానం కల్పించుకోవడంతో ఆ సమస్య అప్పటికి సద్దుమణిగింది. యువనేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా పార్టీ వైఫల్యానికి ఓ కారణంగా మారుతోంది. 

దక్కని సానుభూతి..

నిజానికి మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో కాంగ్రెస్‌ ఇంకా పటిష్ఠ స్థితిలోనే ఉంది. స్వయంతప్పిదాల కారణంగానే మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. అయితే సమన్వయ లోపంతో సానుభూతి ఓట్లను కూడా దక్కించుకోలేకపోయింది. కమల్‌నాథ్ లాంటి సీనియర్‌ నేత నోరు జారటం, అధిష్ఠానం నుంచి సరైన అండ లేకపోవడం హస్తానికి మళ్లీ ఓటమిని మిగిల్చింది. ఈ ఉప ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాలు దక్కించుకోవడంతో పాటు ప్రభుత్వాన్ని సుస్థిరపర్చుకుంది. ఏదేమైనా భారత పెద్ద పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు పూర్వ వైభవాన్ని పొందలేకపోవడం కాదు కదా.. పార్టీ మనుగడ కోసం పోరాడే స్థితికి పడిపోవడం గమనార్హం. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇవీ చదవండి..

ఎన్‌డీఏ జోరు

రాజనీతీశుడు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని