Karnataka Results: కన్నడనాట.. ‘హస్త’వాసిని మార్చిన ‘పంచ’తంత్రం

Karnataka Assembly eelction Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో విజయాన్ని సాధించి హస్తవాసిని మార్చుకుంది కాంగ్రెస్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ విజయం పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

Updated : 13 May 2023 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వరుస ఓటములతో అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం అంచు వరకు వెళ్లిన హస్తం పార్టీ.. తిరిగి బలంగా పుంజుకుంది. ఏడాది ఆరంభంలో హిమాచల్‌ప్రదేశ్‌ ఇచ్చిన విజయోత్సాహం.. కాంగ్రెస్‌ (Congress) నేతల్లో బూస్ట్‌ నింపింది. అదే జోరుతో ఇప్పుడు దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన కర్ణాటక (Karnataka)ను చేజిక్కించుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Karnataka Assembly election Results) ఆ పార్టీ ఘన విజయం సాధించింది. మరి వారి ‘హస్త’వాసిని మార్చిన కాంగ్రెస్‌ ‘పంచ’తంత్రం ఏంటో చూద్దాం..!

సానుభూతి పనిచేసింది..

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినా.. జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎంతోకాలం నిలబడలేదు. ఏడాది తిరిగేసరికి కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత భాజపా అధికారంలోకి వచ్చింది. అయితే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలంతా తర్వాత భాజపాలో చేరి పదవులు దక్కించుకున్నారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం కూలడానికి భాజపానే కారణమనే ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తలు ప్రజల్లోకి బలంగా వెళ్లి కాంగ్రెస్‌కు సానుభూతి లభించింది. తాజా ఎన్నికల్లోనూ హస్తం నేతలు తమ ప్రచారంలో దీన్ని అస్త్రంగా మల్చుకున్నారు. ఆ వ్యూహం ఫలించి భాజపాకు ప్రతికూల గాలి వీచింది.

40శాతం కమీషన్‌ సర్కార్‌ నినాదం..

భాజపా నేత బసవరాజ్ బొమ్మై సర్కారుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీన్ని తమ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న కాంగ్రెస్‌.. భాజపా ప్రభుత్వాన్ని ‘40శాతం కమీషన్‌ సర్కార్‌’ అని అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించింది. అదే సమయంలో అవినీతి వ్యవహారానికి సంబంధించిన కేసులో రాష్ట్ర మంత్రి ఈశ్వరప్పపై కేసు నమోదవడం బొమ్మై ప్రభుత్వాన్ని కుదిపేసింది. మరో ఎమ్మెల్యే విరూపాక్షప్ప నివాసంలో కోట్లాది రూపాయల ధనం దొరకడం సంచలనంగా మారింది.దీన్ని తమకు అనుకూలంగా మాల్చుకున్న కాంగ్రెస్‌.. కమీషన్‌ సర్కారును సాగనంపాలంటూ ప్రచారం చేసింది. ఈ నినాదం బలంగా పనిచేసింది. దీంతో పాటు ‘పేసీఎం’ అంటూ కాంగ్రెస్‌ చేసిన ప్రచారం జనాల్లోకి వెళ్లింది.

ఫలించిన ‘హిమాచల్‌’ వ్యూహం

హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో తమకు గెలుపు సాధించిపెట్టిన వ్యూహాన్నే.. కాంగ్రెస్‌ కర్ణాటకలోనూ అమలు చేసింది. హిమాచల్‌ మాదిరిగానే ఇక్కడా ‘ఐదు గ్యారెంటీ’లను ప్రకటించింది. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. గృహలక్ష్మి పథకం కింద 1.5 కోట్ల గృహిణులకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని, అన్నభాగ్య పథకం కింద నిరుపేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం అందిస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. యువ నిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్రులు, డిప్లొమా పట్టాదారులకు నెలకు రూ.3,000, రూ.1,500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి కల్పిస్తామని వాగ్దానాలు గుప్పించింది. భాజపా అమలుచేసిన జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)ని రద్దుచేసి కర్ణాటక విద్యావిధానం (కేఈపీ)ని అమలు చేస్తామని తెలిపింది. భాజపా తీర్మానించిన ముస్లింలకు 4% రిజర్వేషన్‌ రద్దు తొలగించి, ఎస్‌సీలకు 17 శాతం, ఎస్‌టీలకు 7% రిజర్వేషన్‌ కల్పిస్తూ.. జనాభా ఆధారంగా రిజర్వేషన్‌ ప్రమాణాలను సవరిస్తామని పార్టీ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్లను 75%కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇలా కాంగ్రెస్‌ ప్రకటించిన పలు ఉచితాలు, ఆకర్షణీయ పథకాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.

జోడో యాత్ర నింపిన జోష్‌..

దేశ ప్రజలను ఏకతాటిపైకి తేవడంతో పాటు దేశంలో భాజపాయేతర శక్తి బలంగా ఉందని చాటిచెప్పడం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’.. కర్ణాటకలో పార్టీకి కొత్త ఊపునిచ్చింది. మొత్తం 140 రోజులకు పైగా సాగిన ఈ యాత్రలో.. అత్యధికంగా 21 రోజులు రాహుల్‌ కర్ణాటకలో నడిచారు. చామరాజనగర్‌ జిల్లాలోని గుండ్లుపేటె నుంచి మొదలుపెట్టి మొత్తం 511 కి.మీ రాష్ట్రంలో పర్యటించారు. మైసూరు, మాండ్య, తుమకూరు, చిత్రదుర్గ, బళ్లారి తదితర జిల్లాలో ఈ పర్యటన సాగింది. యాత్ర మధ్యలో వర్షంలోనూ రాహుల్‌ ఓ బహిరంగ సభలో ప్రసంగించిన ఫొటోలు అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇక కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మాండ్యలో జోడో యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష పదవికి రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.

డీకే-సిద్ధూ ఐకమత్యం..

‘కాంగ్రెస్‌లో అందరూ సీఎం అభ్యర్థులే’.. గతంలో హస్తం పార్టీని ఉద్దేశిస్తూ భాజపా చురకలంటించిందిలా. తాజా ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ ఇలాంటి విమర్శలు గుప్పించే ప్రయత్నం చేసింది. కానీ, కాంగ్రెస్‌ వాటిని పారనివ్వలేదు. పార్టీలో అంతర్గతంగా విభేదాలు వచ్చినా.. వాటిని బయటికి రాకుండా పరిష్కరించుకుంది. ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ సీఎం సిద్ధరామయ్య ఐకమత్యంగా కన్పించారు. ఇక, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డీకే సమర్థంగా వ్యవహరించారు. పార్టీలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తేవడంలో సఫలమయ్యారు. పార్టీలో మంచి ట్రబుల్‌షూటర్‌గా పేరున్న శివకుమార్‌.. ఐటీ దాడులను ఎదుర్కొని నిలబడ్డారు. పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపారు. ఇక భాజపా డబుల్ ఇంజిన్‌ సర్కారు అన్నప్పుడల్లా.. తమది జోడెద్దుల(డీకే-సిద్ధూను ఉద్దేశిస్తూ) బండి అని కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇవ్వడం ఓటర్లను ఆకట్టుకుంది. బొమ్మై సర్కారుపై వచ్చిన వ్యతిరేకతను.. సిద్ధూ-డీకే తమకు అనుకూలంగా మల్చుకుని చేసిన ప్రచారం హస్తానికి కలిసొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని