Mamata Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రియాంక.. దీదీ ప్రతిపాదన..!

Modi vs Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఆమె ప్రతిపాదన చేశారు.

Published : 20 Dec 2023 17:55 IST

దిల్లీ: గాంధీ-నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra).. కాంగ్రెస్‌ (Congress) ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే విషయంపై మంగళవారం జరిగిన ‘ఇండియా’ కూటమిలోనూ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రియాంకను వారణాసి (Varanasi) నుంచి బరిలోకి దించాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రతిపాదించినట్లు తృణమూల్‌ వర్గాల సమాచారం.

లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) సమీపిస్తున్న వేళ ‘ఇండియా’ కూటమి నేతలు మంగళవారం దిల్లీలో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఎదుర్కొనే వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ (PM Modi)పై ప్రియాంక గాంధీని నిలబెట్టాలని దీదీ ప్రతిపాదించారట. అయితే, దీనికి కాంగ్రెస్‌ నేతల నుంచి స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ప్రియాంక అభ్యర్థిత్వం గురించి దీదీని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు.

ఖర్గేజీ.. మీరే ప్రధాని అభ్యర్థి

వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలోనే వారణాసి నుంచి ప్రియాంక గాంధీని నిలబెడతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ స్థానంలో కాంగ్రెస్‌.. అజయ్‌ రాయ్‌ని పోటీకి దించింది. అయితే, ఇటీవల పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ చురుగ్గా పాల్గొనడంతో మరోసారి ఆమె అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది. ఆ మధ్య దీనిపై శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ.. ‘‘ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు’ అని పేర్కొన్నారు.

ఇక, మంగళవారం జరిగిన సమావేశంలో ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే ఉండాలంటూ మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌లతోపాటు మరి కొందరు నేతలు చేసిన ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, దీన్ని ఖర్గే సున్నితంగా తిరస్కరించారు. ముందు ఎన్నికల్లో విజయంపై దృష్టి సారిద్దామని, ఆ తర్వాతే అభ్యర్థిని నిర్ణయిద్దామని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు