Pakistan: పాకిస్థాన్‌లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా?

Pakistan: పాకిస్థాన్‌లో 5 లక్షల సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరి ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటంటే..?

Updated : 01 May 2024 19:38 IST

ఇస్లామాబాద్‌: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ (Pakistan).. పన్ను (Tax) ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గతేడాది రిటర్నులు ఫైల్‌ చేయని 5 లక్షల మంది మొబైల్‌ ఫోన్‌ సిమ్‌ కార్డుల (SIM cards)ను బ్లాక్‌ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది.

పన్ను చెల్లింపుల పరిధిని పెంచడంపై పాక్‌ ఫెడరల్‌ బోర్డ్‌ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్‌బీఆర్‌) దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది. వీరు గత మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరానికైనా తమ ఆదాయాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది. అయితే, నోటీసులు వచ్చినప్పటికీ 5,06,671 మంది రిటర్నులను దాఖలు చేయలేదు.

రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్‌ కోట’ ధ్వంసం..!

దీంతో వారి సిమ్‌ కార్డులను తక్షణమే బ్లాక్‌ చేయాలని పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్ అథారిటీ సహా అన్ని టెలికాం ప్రొవైడర్లను ఎఫ్‌బీఆర్‌ ఆదేశించింది. దీనిపై మే 15లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ వ్యక్తులు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా సిమ్‌ కార్డులు పునరుద్ధరిస్తామని వెల్లడించింది. ప్రతి సోమవారం క్రియాశీల పన్ను చెల్లింపుదారుల జాబితాను ప్రకటిస్తామని, ఆ వివరాలను టెలికాం కంపెనీలను అందజేస్తామని పేర్కొంది.

2022 ఆర్థిక ఏడాదిలో పాకిస్థాన్‌లో 59లక్షల మంది తమ రిటర్నులను దాఖలు చేశారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 38లక్షలకు పడిపోగా.. ఈ ఏడాది మార్చి 1 నాటికి మళ్లీ 42లక్షలకు పెరిగినట్లు ఎఫ్‌బీఆర్‌ డేటా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని