Amit Shah: మా హయాంలో ఆ మాటే వినబడదు.. వాళ్ల స్కామ్‌లు లెక్కపెట్టడమే కష్టం.. కాంగ్రెస్‌పై షా సెటైర్‌!

కొత్త సంప్రదాయాలను ప్రారంభించడంలో ప్రధాని మోదీ ముందుంటారని, ఈసారి హిమాచల్‌ భాజపా తిరిగి అధికారంలోని తప్పక వస్తుందని హోంమంత్రి  అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగారా జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 11 Nov 2022 01:18 IST

సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపా తిరిగి అధికారంలోని వచ్చిన వెంటనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున పొంటా సాహిబ్‌లో నిర్వహించిన సభలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ హయాంలో స్కామ్‌ అనే మాట వినిపించదని, కాంగ్రెస్‌ పాలనలో జరిగిన స్కామ్‌లు లెక్కిండం కష్టమని ఎద్దేవా చేశారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు.

భాజపా నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కారు హిమాచల్‌లో ఐఐటీ, ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీలను తీసుకురావడమే కాకుండా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తోందని గుర్తుచేశారు.  భాజపాలో ప్రధాని మోదీ, సీఎం జైరామ్‌ ఠాకూర్‌, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ వంటి వారి నాయకత్వం ఉంటే, కాంగ్రెస్‌లో మాత్రం రాజా-రాణి నాయకత్వం ఉందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో అవకాశం కావాలంటే రాజా-రాణి కుటుంబంలో జన్మించాలని ఎద్దేవా చేశారు.

కొత్త సంప్రదాయాలను ప్రారంభిచడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారని, హిమాచల్‌లో ఈసారి కూడా భాజపానే అధికారం చేపడుతుందని కాంగారా జిల్లాలోని జరిగిన సభలో షా ధీమా వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్‌- వన్‌ పెన్షన్‌ విధానాన్ని కూడా తమ ప్రభుత్వం అమలు చేసిందని  గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ పునరుద్ధరణ, ఆర్టికల్‌ 370 రద్దు, పీవోకేలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులకు మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే కారణమని అన్నారు.

భాజపా ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని, ఓటు బ్యాంకు గురించి తమకు ఆందోళన లేదని, అభివృద్ధి చేయడంపైనే తమ దృష్టి ఉంటుందని అమిత్ షా అన్నారు. రాహుల్‌ గాంధీ ప్రతి రోజూ ఉదయాన్నే ప్రతికూల ట్వీట్లు చేస్తారని, ప్రజలు వాటిని పట్టించుకోనట్లే.. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా భాజపానే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని