Rajasthan: రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ.. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు పగ్గాలు

Rajasthan chief minister: రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ ఎంపికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని సీఎం పదవి అప్పగిస్తూ భాజపా అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Updated : 12 Dec 2023 16:58 IST

జైపుర్‌: ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రుల ఎంపికలో కొత్త ముఖాలకు అవకాశమిచ్చిన భాజపా (BJP) అధిష్ఠానం.. రాజస్థాన్‌ (Rajasthan)లోనూ అదే సంప్రదాయాన్ని పాటించింది. అయితే, ఈసారి అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి సీఎం పగ్గాలు అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌ నూతన ముఖ్యమంత్రి (chief minister)గా ఎమ్మెల్యే భజన్‌లాల్‌ శర్మ (Bhajanlal Sharma)ను ఎంపిక చేసింది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

అధిష్ఠాన పరిశీలకులుగా వచ్చిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వినోద్‌ తావ్డే, సరోజ్‌ పాండే సమక్షంలో 115 మంది కొత్త ఎమ్మెల్యేలు మంగళవారం జైపుర్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో భజన్‌లాల్‌ శర్మను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇద్దరు ఉపముఖ్యమంత్రులను కూడా ప్రకటించారు. దియా సింగ్‌ కుమారి, ప్రేమ్‌ చంద్‌ బైర్వా డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎవరీ భజన్‌లాల్‌ శర్మ..

బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మ (Bhajanlal Sharma) ప్రస్తుతం భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. నాలుగు సార్లు ఆయన ఈ పదవి చేపట్టారు. ఇప్పటివరకు పార్టీలో సంస్థాగతంగా కీలక వ్యవహరించిన భజన్‌లాల్‌.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సంగనేర్‌ నుంచి పోటీ చేసిన ఆయన.. తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 48వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. భజన్‌లాల్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ మంచి అనుబంధం ఉంది. గతంలో ఏబీవీపీ నేతగా వ్యవహరించారు. 56ఏళ్ల భజన్‌లాల్‌ పీజీ పూర్తి చేశారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులు లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని