Nitish Kumar: గతం మర్చిపోదాం.. తేజస్వీతో నీతీశ్‌ వ్యాఖ్య

బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్‌.. నేడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే తన ప్రత్యర్థి అయిన ఆర్జేడీతో

Published : 10 Aug 2022 01:44 IST

పట్నా: బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్‌.. నేడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే తన ప్రత్యర్థి అయిన ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజీనామా అనంతరం నేరుగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ నివాసానికి వెళ్లిన నీతీశ్.. ఆయనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.

ఈ సందర్భంగా తేజస్వీతో నీతీశ్ మాట్లాడుతూ.. ‘‘2017లో ఏం జరిగిందో అదంతా మర్చిపోదాం. కొత్త అధ్యాయాన్ని మొదలుపెడతాం’’ అని చెప్పినట్లు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. మహాగఠ్‌బంధన్‌ కూటమి నుంచి విడిపోయి తాను తప్పుచేశానని, ఇందుకు పశ్చాత్తాప పడుతున్నానని నీతీశ్ విచారం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి. 

నీతీశ్‌తో పొత్తుకు తేజస్వీ యాదవ్‌ సుముఖత వ్యక్తం చేశారు. జేడీ(యు)కు ఆర్జేడీ మద్దతిస్తున్నట్లు పేర్కొంటూ ఓ లేఖకు గవర్నర్‌కు అందజేయనున్నారు. ఈ క్రమంలోనే మహాగఠ్‌బంధన్‌ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నట్లు సమాచారం. మరికాసేపట్లో నీతీశ్‌.. తేజస్వీతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వీరు గవర్నర్‌ను కోరే అవకాశముంది. మరోవైపు జీతన్‌రామ్ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామీ మోర్చా కూడా నీతీశ్‌కు మద్దతు ప్రకటించింది.

బిహార్‌ ప్రజలను మోసం చేశారు..

మరోవైపు ఎన్డీయే కూటమి నుంచి జేడీ(యు) బంధం తెంచుకోవడంపై కాషాయ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నీతీశ్.. భాజపాను, బిహార్‌ ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబడుతున్నారు. ‘‘2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కింద మేం పోటీ చేసి విజయం సాధించాం. మాకు సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. నీతీశ్‌ను సీఎంగా ఎన్నుకున్నాం. కానీ, ఈ రోజు ఆయన భాజపాను, బిహార్‌ ప్రజలను మోసం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటీకీ సహించబోరు’’ అని బిహార్‌ భాజపా చీఫ్‌ సంజయ్‌ జైశ్వాల్‌ ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని