పాచిపోయిన లడ్డూల్లో కిస్‌మిస్‌ వేశారా?:అంబటి

ఏ ప్రభుత్వమైనా వైఫల్యం చెందిందని ఏడు నెలల్లో నిర్ణయిస్తారా? అని వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో ఎవరూ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను

Published : 17 Jan 2020 00:09 IST

అమరావతి: ఏ ప్రభుత్వమైనా వైఫల్యం చెందిందని ఏడు నెలల్లో నిర్ణయిస్తారా? అని వైకాపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. గతంలో ఎవరూ చేయని అనేక సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై భాజపా, జనసేన నేతలు చేసిన విమర్శలపై అంబటి స్పందించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమపై విమర్శలు చేసినందునే సమాధానం ఇవ్వాలని మీడియా ముందుకొచ్చామన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వైకాపా భయపడదని చెప్పారు. తమ పోకడ, పద్ధతులే వేరని వ్యాఖ్యానించారు. ఏ పార్టీతోనూ కలవకుండా ఒంటిచేత్తో 151 సీట్లు గెలుచుకున్నామని.. సీట్ల విషయంలో కూడికలు, తీసివేతలతో తామెప్పుడూ రాజకీయాలు చేయలేదని చెప్పారు. 

పవన్‌కు స్థిరత్వం లేదు

రాజకీయంగా, వ్యక్తిగతంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు స్థిరత్వం లేదని అంబటి వ్యాఖ్యానించారు. అయితే బేషరతుగా భాజపాతో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని పవన్‌ను ఆయన నిలదీశారు. పాచిపోయిన లడ్డూలు అంటూ భాజపాపై గతంలో ఆయన విమర్శలు గుప్పించారని..ఇప్పుడు తాజా లడ్డూలు పంపించారా? అని అంబటి ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా గురించి మాట్లాడకుండా బేషరతుగా ఎందుకు మద్దతిస్తున్నాని ప్రశ్నించారు. రాష్ట్రానికి భాజపాతోనే న్యాయం జరుగుతుందని నమ్మిన పవన్‌.. ‘హోదా’ గురించి మమ్మల్ని ప్రశ్నించడమేంటని విమర్శించారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే రాజకీయ కూటమి ఏర్పాటు చేశారా? అని అంబటి ప్రశ్నించారు. రాజకీయ స్థిరత్వంలేని పవన్‌.. నాలుగున్నరేళ్లు ఒకే పార్టీతో ఉండగలరా? అని ఆయన ధ్వజమెత్తారు.

ఎన్ని పార్టీలు కలిసినా మాకు నష్టం లేదు

‘‘పవన్‌ ఏ పార్టీ కార్యాలయంలో కూర్చొంటారో ఆ పార్టీకి మద్దతిస్తారు. ఆయన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే. ఆనాడు పాచిపోయిన లడ్డూలు అన్నారు.. ఇప్పుడు వాటిలో కిస్‌మిస్‌ వేశారా? 2014లో తెదేపా, భాజపా.. 2019లో వామపక్షాలు, బీఎస్పీతో కలిశారు. ఇప్పుడు భాజపాతో వెళ్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసినా వైకాపాకు నష్టం లేదు. కులతత్వం ఎక్కడ చూపించామో నిరూపించాలి. భాజపా, జనసేన పెద్దగా గుర్తింపు లేని పార్టీలు. గత ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయో అందరికీ తెలుసు’’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని