ఎన్నికల ప్రక్రియను తారుమారు చేశారు:ఉత్తమ్‌

తెలంగాణలో జరగనున్న పురపాలిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

Published : 18 Jan 2020 00:22 IST

హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న పురపాలిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియను తారుమారు చేశారని.. న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే తెరాసకు ఒక్క సీటు కూడా దక్కదని ఉత్తమ్‌ అన్నారు. ఎన్నికల ప్రకటన, నామినేషన్ ప్రక్రియకు మధ్య వ్యవధి లేకపోవడం వల్లనే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయని ఉత్తమ్‌ చెప్పారు. వార్డు రిజర్వేషన్లను తెరాస ముందుగానే తెలుసుకొని రాజకీయ లబ్ధి పొందిందని ఉత్తమ్‌ ఆరోపించారు. ఎన్నికల నోటిషికేషన్‌, నామినేషన్‌ ప్రక్రియకు మధ్య వ్యవధి కావాలని మాత్రమే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు దాదాపు 500 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందని కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్‌ ఖండించారు. తెరాస నేతలు స్థానిక పోలీసుల సాయంతో నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా కాంగ్రెస్‌ నేతలను అడ్డుకున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల పోలీసుల సమక్షంలోనే కొట్టి, వేసిన నామినేషన్లను బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. బ్యాక్ డోర్ పద్ధతుల ద్వారా విజయాన్ని సాధించేందుకు తెరాస ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. తెరాస బూటకపు వాగ్దానాలను విశ్వసించొద్దని ఉత్తమ్‌ ప్రజలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని