కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: కళా

ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పిన వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకు తింటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. దళితులపై వైకాపా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. బుధవారం మీడియాతో

Updated : 04 Jun 2020 11:12 IST

విజయవాడ: ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పిన వైకాపా నేతలు పంచ భూతాలను పంచుకు తింటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. దళితులపై వైకాపా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో దొంగలు పాలకులు అవుతారని బ్రహ్మంగారు చెప్తే ఎవరి గురించో అనుకున్నాం.. కానీ, ఆయన చెప్పింది వైకాపా నేతల గురించేనని ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. చివరికి ఇసుక, మట్టి కూడా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెదేపా హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తే.. ఇప్పుడు ఇసుక కావాలంటే వైకాపా నేతలకు ప్రజలు కమీషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

ఇసుక రీచ్‌లో ఎత్తిన ఇసుక ఇంటికి చేరకుండా మధ్యలోనే మాయమవుతోందని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే చెప్తున్నారంటే వైకాపా నేతల ఇసుక దోపిడీ ఏ విధంగా ఉందో అర్థమవుతోందని దుయ్యబట్టారు. వైకాపా పాలనలో ఇసుక కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ధర రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పలికిందని.. ఇప్పుడు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఇసుక కొనలేక ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆపేసి మొండి గోడల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇసుక దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేసి సామాన్యులకు పూర్తిగా ఇసుక అందుబాటులోకి వచ్చేవిధంగా దృష్టి సారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే ఇసుక తుపానులో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని కళా వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని