
పీవీని ఎవరు పొగిడినా స్వాగతిస్తాం...
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పీవీ నరసింహరావు దేశాన్ని నడిపించిన తీరును గర్వంగా చెప్పుకోవాలన్నారు. పీవీ గురించి ఎవరు గొప్పగా చెప్పినా స్వాగతిస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్తమ్ వివరించారు. ప్రధానిగా పీవీ చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరువదని ఉత్తమ్ కొనియాడారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ 2009లోనే కేంద్రానికి సిఫారసు చేసింది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్‌కు పీవీ నరసింహారావు పేరును కాంగ్రెస్ పార్టీ పెట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆసుపత్రుల్లో రోగులకు ఒక్క పడక కూడా అందుబాటులో లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కరోనా కట్టడిలో కేసీఆర్ సమర్థత ఏంటో ప్రజలు తెలుసుకున్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు ఒక్క కొవిడ్ ఆసుపత్రి మాత్రమే ఉంది. కొవిడ్-19 ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కేంద్రం రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాలేదు. కేంద్రంతో సహా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. కొవిడ్ బారిన పడిన పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
- ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ జులై 3న నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపడతాం. తెల్లరేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందాన్ని తెలంగాణ కాంగ్రెస్ కలసి రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి నివేదిక ఇస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని జులై నాలుగున నిరసన చేపడతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.