ఆ అమర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలంటే...

దుందుడుకు చైనా ఆక్రమించిన భూమిని తిరిగి కైవసం చేసుకొంటేనే ఆ ఇరవై మంది అమర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరుతుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. తాము భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అండగా ....

Published : 29 Jun 2020 19:23 IST

చైనా ఆక్రమించిన ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి: అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: దుందుడుకు చైనా ఆక్రమించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకొంటేనే ఆ ఇరవై మంది అమర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరుతుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. తాము భారత సైన్యం, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అండగా ఉంటామని పేర్కొన్నారు.

కొన్ని రోజుల క్రితం తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికులు బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. 40 మందికి పైగా డ్రాగన్‌ సైనికులు హతమైనట్లు తెలిసింది. సరిహద్దుల్లో ఉద్రికత్తలపై మీ వైఖరేంటని ప్రశ్నించగా కేజ్రీవాల్‌ స్పందించారు.

‘ప్రస్తుతం దేశమంతా ఆగ్రహంగా ఉంది. సైన్యానికి అండగా నిలుస్తోంది. ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. చైనా ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోకపోతే గల్వాన్‌లో అమరులైన 20 మంది జవాన్లకు శాంతి కలగదు’ అని కేజ్రీవాల్‌ అన్నారు. 1962 నుంచి భారత్‌ స్నేహహస్తంచాస్తున్నా డ్రాగన్‌‌ మాత్రం దొంగదెబ్బ తీస్తోందని పేర్కొన్నారు.

‘ఇప్పుడు మన వ్యూహం మారాలని భావిస్తున్నా. స్నేహహస్తం చాచినా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. వారెప్పుడైనా మోసం చేయొచ్చు’ అని కేజ్రీవాల్‌ అనుమానం వ్యక్తం చేశారు. చైనా వస్తువులపై ఆధారపడడం తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు.

‘ప్రస్తుతం చిన్న గణపతి విగ్రహాలూ చైనా నుంచే వస్తున్నాయి. దీపావళి టపాకాయాలూ అక్కడివే. ఎందుకిలా? భారత వ్యాపారులకు ఆ సామర్థ్యం ఉంది. కానీ, వాళ్లకు మద్దతు కావాలి. చైనా నుంచి ఏయే వస్తువులు దిగుమతి చేసుకుంటున్నామో గుర్తించి భారత్‌లో వాటిని దేశీయంగా తయారు చేసేలా ప్రోత్సహించాలి. దీనిని ఒక అవకాశంగా తీసుకొని చైనాపై ఆధారపడటం తగ్గించాలి. లక్షల మంది భారతీయులకు ఉపాధి కల్పించాలి’ అని కేజ్రీవాల్‌ సూచించారు.

భాజపాపై కాంగ్రెస్‌ విమర్శల గురించి ప్రశ్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అయితే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మాత్రం అందరికీ ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని