
Raj Bhavan: రాజ్‌భవన్‌పై తెలుగు ముద్ర
గవర్నర్లుగా 22 మంది తెలుగు వారు
దిల్లీ: గవర్నర్.. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు. అసలైన అధికారాలన్నీ ముఖ్యమంత్రి చేతిలో కేంద్రీకృతమైనా రాష్ట్ర పరిపాలన మొత్తం ఆయన పేరునే సాగుతుంది. రాష్ట్ర శాసనసభ చేసిన ఆమోదించిన బిల్లులన్నీ గవర్నర్ ముద్రపడితేనే చట్టాలుగా మారుతాయి. ముఖ్యమంత్రులు, జిల్లా జడ్జిల నియామకం ఆయన చేతులమీదుగానే సాగుతుంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి పాలన సమయాల్లో గవర్నర్ చేతిలోనే రాష్ట్రంలోని అధికారాలు కేంద్రీకృతమవుతాయి. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండే గవర్నర్లుగా మన తెలుగువారు తొలి నుంచి రాణించారు. ఇప్పటి వరకు 22 మంది తెలుగు వారు వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పని చేశారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల రాజ్‌భవన్‌లలో తెలుగు పతాకం ఎగిరింది. ముఖ్యమంత్రులుగా పని చేసిన బూర్గుల రామకృష్ణారావు (హైదరాబాద్ రాష్ట్రం), పి.ఎస్.కుమారస్వామి రాజా (మద్రాస్ ప్రెసిడెన్సీ), బెజవాడ గోపాలరెడ్డి (ఆంధ్ర రాష్ట్రం), మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్య (ఆంధ్రప్రదేశ్) వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా వ్యవహరించారు. సభాపతిగా పని చేసిన కోన ప్రభాకర్‌రావు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా పని చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరిపాలన పూర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ల చేతిలోనే ఉంటుంది.
తొలి గవర్నర్లుగా...
హైదరాబాద్‌లో పుట్టి తెలుగింటి కోడలైన సరోజని నాయుడు యునైటెడ్ ప్రావిన్సెస్ (నేటి ఉత్తర్‌ప్రదేశ్)కు, భోగరాజు పట్టాభి సీతారామయ్య మధ్యప్రదేశ్, బూర్గుల రామకృష్ణారావు కేరళ రాష్ట్రాలకు తొలి గవర్నర్లుగా పని చేశారు.
ఆంధ్ర నుంచి 13మంది.. తెలంగాణ నుంచి ఆరుగురు..
ఆంధ్రప్రదేశ్ నుంచి 13మంది గవర్నర్లు కాగా, తెలంగాణ నుంచి ఆరుగురు, ఒడిశా, తమిళనాడులోని తెలుగు కుటుంబాల్లో జన్మించిన ఇద్దరు, తెలుగింటి కోడలుగా వచ్చిన ఒకరు గవర్నర్లు అయ్యారు. కొణిజేటి రోశయ్య గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తాజాగా కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి దక్కింది. తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ పదవి నుంచి హరియాణా గవర్నర్‌గా బదిలీ అయ్యారు.
1.భోగరాజు పట్టాభి సీతారామయ్య, మధ్యప్రదేశ్ మొదటి గవర్నర్ 1956-57 (పశ్చిమ గోదావరి జిల్లా)
2.బూర్గుల రామకృష్ణారావు, కేరళ మొదటి గవర్నర్, 1956-60, 1960-62 (ఉత్తర్‌ప్రదేశ్) (మహబూబ్‌నగర్ జిల్లా)
3.వి.వి.గిరిఉత్తర్‌ప్రదేశ్ (1957-60), కేరళ (1960-65), కర్ణాటక (1965-67) (బెర్హంపూర్, ఒడిశా)
4.బెజవాడ గోపాలరెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ (1967-72) (నెల్లూరు జిల్లా)
5.మర్రి చెన్నారెడ్డి ఉత్తర్‌ప్రదేశ్ (1974-77), పంజాబ్ (1982-83), రాజస్థాన్ (1992-93), తమిళనాడు (1993-96) (రంగారెడ్డి జిల్లా)
6.కోన ప్రభాకర్‌రావు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (1983-84), సిక్కిం (1984-85), మహారాష్ట్ర (1985-86) (గుంటూరు జిల్లా)
7.పెండేకంటి వెంకట సుబ్బయ్య, బిహార్ (1985-88), కర్ణాటక (1987-1990) (కర్నూలు జిల్లా)
8.జనరల్ కె.వి.కృష్ణారావు మణిపూర్, నాగాలాండ్ (1984-1989), జమ్ము కశ్మీర్ 1989-90, 1993-99 (విజయనగరం జిల్లా)
9.కాసు బ్రహ్మానందరెడ్డి, మహారాష్ట్ర (1988-90) (గుంటూరు జిల్లా)
10.బి.సత్యనారాయణ రెడ్డి, ఉత్తర్‌ప్రదేశ్ (1990-93), ఒడిశా (1993-95) (మహబూబ్‌నగర్ జిల్లా)
11.కె.వి.రఘునాథరెడ్డి, త్రిపుర (1990-93), పశ్చిమ బెంగాల్ (1993-98) (నెల్లూరు జిల్లా)
12.పి.శివశంకర్, సిక్కిం (1994-95), కేరళ (1995-96) (మెదక్ జిల్లా)
13.వి.ఎస్.రమాదేవి, హిమాచల్ ప్రదేశ్ (1997-99), కర్ణాటక (1999-2002) (పశ్చిమ గోదావరి జిల్లా)
14.పి.ఎస్.రామ్మోహన్‌రావు, తమిళనాడు (2002-2004) (పశ్చిమ గోదావరి జిల్లా)
15.వి.రామారావు, సిక్కిం (2002-2007) (కృష్ణా జిల్లా)
16.కొణిజేటి రోశయ్య, తమిళనాడు (2011-16) (గుంటూరు జిల్లా)
17.చెన్నమనేని విద్యాసాగర్‌రావు, మహారాష్ట్ర (2014-19) (కరీంనగర్ జిల్లా)
18.బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ (2019-21), హరియాణా (2021-) (హైదరాబాద్ జిల్లా)
19.కంభంపాటి హరిబాబు, మిజోరం (2021-) (ప్రకాశం జిల్లా)
20.సరోజిని నాయుడు, యునైటెడ్ ప్రావిన్సెస్ (నేటి ఉత్తర్‌ప్రదేశ్) (1947-49) (హైదరాబాద్)
21.పద్మజా నాయుడు, పశ్చిమ బెంగాల్ (1956-1967) (హైదరాబాద్)
22.పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా, ఒడిశా (1954-56) (తమిళనాడు)
✦ వి.వి.గిరి ఒడిశాలోని బరంపూర్‌లో తెలుగు కుటుంబంలో పుట్టారు. బెంగాలీ దంపతులకు హైదరాబాద్‌లో జన్మించిన సరోజిని నాయుడు, తెలుగు వైద్యుడు గోవిందరాజుల నాయుడిని వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె పద్మజా నాయుడు గవర్నర్‌గా పని చేశారు. పి.ఎస్.కుమార్ రాజాగా పేరుగాంచిన పూసపాటి సంజీవ కుమార్ రాజా తమిళనాడులోని రాజాపాళ్యంలో తెలుగు కుటుంబంలో జన్మించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగానూ పని చేశారు.
ఇప్పటి వరకు ఏకకాలంలో వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా ఉన్న తెలుగువారు
✦ బూర్గుల రామకృష్ణారావు, వి.వి.గిరి, పద్మజా నాయుడు
✦ పెండేకంటి వెంకట సుబ్బయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, జనరల్ కె.వి.కృష్ణారావు
✦ మర్రి చెన్నారెడ్డి, బి.సత్యనారాయణరెడ్డి, కె.వి.రఘునాథరెడ్డి, జనరల్ కె.వి.కృష్ణారావు
✦ కె.వి.రఘునాధరెడ్డి, పి.శివశంకర్, జనరల్ కె.వి.కృష్ణారావు
✦ పి.ఎస్.రామ్మోహన్‌రావు, వి.రామారావు
✦ రోశయ్య, విద్యాసాగర్‌రావు