Viveka Murder Case: వివేకా హత్యతో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదు: రాచమల్లు

‘‘మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కుట్రలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఉందని నిరూపిస్తే నాతో కలిపి జిల్లాలోని మరో 9 మంది ఎమ్మెల్యేలం

Updated : 17 Nov 2021 13:04 IST

నిరూపిస్తే నాతో సహా 9మంది ఎమ్మెల్యేలు రాజీనామా

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సవాల్‌

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ‘‘మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కుట్రలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ ఉందని నిరూపిస్తే నాతో కలిపి జిల్లాలోని మరో 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం’’ అని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సీబీఐకి సవాల్‌ విసిరారు. మంగళవారం ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘డబ్బు, అవమానం, వ్యక్తిగత బలహీనతలే వివేకా హత్యకు ప్రధాన కారణాలు. ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమామహేశ్వర్‌రెడ్డి, దస్తగిరిలే హత్యకు కారకులు. మొదట పోలీసులు, సిట్‌, సీబీఐల దర్యాప్తులో భాగంగా ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన 161 స్టేట్‌మెంట్‌లో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల పేర్లు లేవు. తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో మేజిస్ట్రేట్‌ ముందు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం 164 స్టేట్‌మెంట్‌లో ఎర్రగంగిరెడ్డి ఆయనకు చెప్పినట్లు ఆ నలుగురి పేర్లు చెప్పారు. ఈ రెండు స్టేట్‌మెంట్లకు పొంతన లేదు.

దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయడం లేదు: హత్యలో పాల్గొన్నానని డ్రైవరు దస్తగిరి వాంగ్మూలం ఇస్తే ఈ రోజు వరకు అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదని సీబీఐని ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. ‘‘అతన్ని అప్రూవర్‌గా మార్చడంలో భాగంగానే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ముద్దాయిని సాక్షిగా మార్చేందుకు హైకోర్టును సీబీఐ అనుమతి కోరడం సబబుగా లేదు’ అని అన్నారు.

దస్తగిరి అప్రూవర్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు నేడు

ఈటీవీ, కడప: వివేకా హత్య కేసులో దస్తగిరి తరఫున సీబీఐ వేసిన అప్రూవర్‌ పిటిషన్‌పై న్యాయవాదులు బుధవారం కోర్టులో కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నాడని... అతని సాక్ష్యం నమోదు చేయాలని అక్టోబరు 22న సీబీఐ కడప సబ్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు పంపింది. దాంతో కౌంటర్‌ దాఖలుకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పత్రాలను ఇవ్వాలని ఈ ముగ్గురి తరఫు న్యాయవాదులు కోరారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈనెల 13న వాటిని అందజేసింది.

ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై కడప సబ్‌ కోర్టులో విచారణ ఈనెల 19కు వాయిదా పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని