Updated : 24 Jun 2022 10:28 IST

MK Stalin: నాశనం చేయాలనుకుని పతనమవుతున్నారు

అన్నాడీఎంకేపై స్టాలిన్‌ పరోక్ష విమర్శలు

వరుడికి మంగళసూత్రం అందిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకేను నాశనం చేయాలనుకుని వారే పతనమవుతున్నారంటూ అన్నాడీఎంకేపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ పరోక్ష విమర్శలు చేశారు. రెవెన్యూశాఖ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ మనవరాలు దీప్తి-విశ్వక్సేన వివాహ కార్యక్రమం తిరువాన్మియూర్‌లో గురువారం జరిగింది. ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడైన స్టాలిన్‌ అధ్యక్షత వహించి పెళ్లి కార్యక్రమాన్ని జరిపించారు. వధూవరులను ఆశీర్వదించి ఆయన ప్రసంగిస్తూ... ఈ కల్యాణ మండపంలో తమ ఇంటి పెళ్లి జరుగుతున్నట్టు భావించి అందరూ హాజరయ్యారని తెలిపారు. మరో కల్యాణ మండపంలో ఏం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసంటూ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశ తతంగాన్ని పరోక్షంగా ఉదహరించారు. ఆ విషయంలోకి వెళ్లదలచుకోలేదని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. అయితే వారే మనల్ని నాశనం చేయాలనుకుని ప్రస్తుతం వారే పతనమవుతున్నారని పేర్కొన్నారు. డీఎంకే పతనమైన చరిత్ర లేదన్నారు. కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ ఎంజీఆర్‌, కరుణానిధి మంత్రివర్గాల్లోనూ ఉన్నారని, ప్రజాసేవలో ఆయన అంకితభావానికి ఇది నిదర్శనమని తెలిపారు. దక్షిణ ప్రాంతానికి పెరియ మరుదు, చిన్న మరుదుగా కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, తంగం తెన్నరసు ఉన్నారని, ఆ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. రామచంద్రన్‌ కుటుంబ సభ్యులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధంతోనే ఆరోగ్యం నలతగా ఉన్నా పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. కార్యక్రమంలో స్టాలిన్‌ సతీమణి దుర్గా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌, ద్రావిడర్‌ కళగం అధ్యక్షుడు వీరమణి, మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, సుబ్రమణియన్‌, పొన్ముడి తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు సాయం ప్రకటన
బాణసంచా పరిశ్రమలో పేలుడు దుర్ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలోని క్షతగాత్రురాలైన వసంతకు కడలూరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సీఎం జనరల్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వ సాయం అందించాలని ఆదేశించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
కమిటీకి అభినందనలు
పుదుకోట్టై సంస్థానం రాజు రాజగోపాల తొండైమాన్‌ శత జయంత్యుత్సవాల కమిటీకి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. రాజగోపాల తొండైమాన్‌ శత జయంత్యుత్సవాలు గురువారం జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో... స్వతంత్ర భారతదేశ హోంశాఖ మంత్రిగా ఉన్న సర్ధార్‌ వల్లభాయ్‌ పటేట్‌ పిలుపు మేరకు పుదుకోట్టై సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి రాజగోపాల తొండైమాన్‌ అంగీకరించారని తెలిపారు. సంస్థానం ఖజానా నుంచి రూ.53 లక్షల విలువైన నగలు, నగదు అప్పగించిన మహనీయుడని కొనియాడారు. శత జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన నిరాడంబరత, సేవలను స్మరించుకోవాలన్నారు. ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
వరద నివారణ చర్యలపై సమీక్ష
నగరంలో జరుగుతున్న వరద నివారణ చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఇందులో చెన్నై, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వరద నివారణ చర్యల గురించి సమీక్షించారు. పనుల ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుని వాటిని సకాలంలో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, వేలు, అన్బరసన్‌, సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని