YSRCP: వెలంపల్లి X ఉదయభాను.. దుర్భాషలాడుకున్న వైకాపా ఎమ్మెల్యేలు

వైకాపా ఎమ్మెల్యేలు దుర్భాషలాడుకున్న ఘటన విజయవాడలో  చోటుచేసుకుంది. వైకాపా నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ జన్మదినం సందర్భంగా పటమటలోని పార్టీ కార్యాలయానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 25 Jan 2023 07:40 IST

పటమట, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యేలు దుర్భాషలాడుకున్న ఘటన విజయవాడలో  చోటుచేసుకుంది. వైకాపా నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ జన్మదినం సందర్భంగా పటమటలోని పార్టీ కార్యాలయానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి వెళ్తున్న సమయంలో పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌ వచ్చారు.  ఉదయభాను ఎదురుపడగానే వెలంపల్లి ఆగ్రహంతో... తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌నేత శ్రీనివాస్‌ను సీఎం జగన్‌ దగ్గరకు తీసుకెళ్లడానికి ‘నువ్వు ఎవరు? పోటుగాడివా..’ అని పరుష పదజాలంతో దూషించారు. ‘పార్టీలో సీనియర్‌ లీడర్‌ను. నీలా పదవి కోసం మారలేదు. మూడు పార్టీలు మారిన ఊసరవెల్లివి నువ్వు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు నాకు చెప్పేదేంటి...’ అని ఉదయభాను  ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇరునేతల అనుచరులు వారిని పక్కకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది.

ఇదీ నేపథ్యం: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆకుల శ్రీనివాసరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన వెలంపల్లి  ఓటమి పాలయ్యారు. ఇటీవల కాలంలో ఆకుల వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గతవారం ఉదయభాను తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇదే సమయంలో అక్కడ ఆకుల శ్రీనివాస్‌ ఎదురుపడ్డారు. ఈ నెల 28న తన కుమార్తె వివాహమని, సీఎం జగన్‌కు ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చానని ఆకుల తెలిపారు. ఉదయభాను తనతో పాటు శ్రీనివాస్‌ను సీఎం వద్దకు తీసుకువెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందజేయించారు.  తన మీద పోటీచేసిన వ్యక్తిని జగన్‌ వద్దకు తీసుకెళ్లడంపై వెలంపల్లి మంగళవారం  ఉదయభానుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని