రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ.. భారాస, ఆమ్‌ఆద్మీ పార్టీల నిర్ణయం: కేశవరావు

భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారత్‌ రాష్ట్ర సమితి, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌)లు నిర్ణయించాయని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు.

Updated : 31 Jan 2023 06:53 IST

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారత్‌ రాష్ట్ర సమితి, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌)లు నిర్ణయించాయని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తెలిపారు. సోమవారం దిల్లీలో జరిగిన సమావేశంలో రెండు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని.. బహిష్కరణకు గల కారణాలను మంగళవారం మధ్యాహ్నం విజయ్‌చౌక్‌ వద్ద వెల్లడిస్తామని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఇందుకు నిరసనగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని మా పార్టీతోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది’’ అని కేశవరావు తెలిపారు.

ప్రొరోగ్‌ చేయనప్పుడు గవర్నర్‌ను పిలవాల్సిన పని లేదు

శాసనసభ సమావేశాలను ప్రొరోగ్‌ చేయనప్పుడు గవర్నర్‌ను పిలవాల్సిన అవసరం లేదని కేశవరావు అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌ తమిళిసై కావాలనే రాజ్యాంగపరమైన సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బిల్లులు పెండింగ్‌లో పెట్టుకుంటా... రాష్ట్రపతికి పంపుతా అంటే పర్లేదని, బడ్జెట్‌ను ఆమోదించను అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడవకుండా చేయడమేనని వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెంపు, మహిళా రిజర్వేషన్‌ బిల్లు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతుల ఆదాయం రెట్టింపుపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేసినట్లు భారాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ షేర్లు పడిపోవడానికి కారణాలపై ఉభయ సభల్లో చర్చించాల్సి ఉందన్నారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రధాన అంశాలను పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తామని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, తెలంగాణపై కుట్రలను పార్లమెంట్‌లో ఎండగడతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని