రేవంత్‌పై చట్టపరమైన చర్యలు తప్పవు!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతిభవన్‌ మీద మావోయిస్టులు గ్రనేడ్లు వేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు విమర్శించారు.

Published : 09 Feb 2023 04:21 IST

వెంటనే క్షమాపణలు చెప్పాలి
ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించాలి
మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతిభవన్‌ మీద మావోయిస్టులు గ్రనేడ్లు వేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు విమర్శించారు. రేవంత్‌ వ్యాఖ్యలను భారాస పార్టీ, ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పకపోతే తగిన పరిణామాలుంటాయని.. ప్రజలు తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. సీఎం, హోంశాఖ మంత్రి, డీజీపీల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారా? లేదా ఇదే కాంగ్రెస్‌ విధానమా? స్పష్టం చేయాలన్నారు. ఆయనను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్‌, నన్నపనేని నరేందర్‌లతో కలిసి ఎర్రబెల్లి, సత్యవతి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘మావోయిస్టులకు, ప్రజలకు రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి. అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసిన ప్రగతిభవన్‌ను పేల్చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యత వహించాలి. లేకపోతే ఆ పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

డీజీపీకి భారాస ఎమ్మెల్సీల ఫిర్యాదు

ప్రగతిభవన్‌ను పేల్చేయాలంటూ వ్యాఖ్యానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారాస ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేశారు. ఈమేరకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎల్‌.రమణ, శంభీపూర్‌ రాజు, తాతా మధు, విఠల్‌, తక్కెళ్లపల్లి రవీందర్‌రావులు బుధవారం హైదరాబాద్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను కలిసి ఫిర్యాదు అందించారు. ‘‘చట్టసభల్లో సభ్యుడిగా ఉంటూ అధికారిక భవనాలను పేల్చేయాలని వ్యాఖ్యలు చేయడం చట్టవ్యతిరేక చర్యగా భావించాలి. రేవంత్‌ ప్రసంగాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు