కలిసికట్టుగా.. గెలుపు జట్టుగా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయానికి తెదేపా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేశారు. రకరకాల సమస్యలు ఎదురైనా.. వాటిని అధిగమించి 19 మంది ఎమ్మెల్యేలూ వచ్చి ఓటేశారు.

Updated : 24 Mar 2023 06:28 IST

వ్యూహాత్మకంగా అనురాధను గెలిపించుకున్న తెదేపా

ఈనాడు - అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయానికి తెదేపా ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా పనిచేశారు. రకరకాల సమస్యలు ఎదురైనా.. వాటిని అధిగమించి 19 మంది ఎమ్మెల్యేలూ వచ్చి ఓటేశారు. ఒక్క ఓటు చేజారనీయకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. శస్త్రచికిత్స చేయించుకున్న రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఈ నెల 25 వరకు కదిలే పరిస్థితి లేదు. అయినా వైద్య సలహాలు తీసుకుంటూ వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. శస్త్రచికిత్స చేయించుకున్న మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా చక్రాల కుర్చీలో అతి కష్టంపై వచ్చి ఓటేశారు. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని బుధవారమే విజయవాడ చేరుకున్నారు. ఆమె భర్త, మామను అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో తిరిగి రాజమహేంద్రవరం వెళ్లిపోయారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి గురువారం ఆమె ఓటేసేందుకు వచ్చారు. గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి గతంలో రెండుసార్లు రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే పంపారు. ఉప ఎన్నిక వస్తుందనే భయంతో ప్రభుత్వం దాన్ని ఆమోదించలేదు. తాజా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో బుధవారం సాయంత్రం నుంచి ఆయన రాజీనామాను సభాపతి ఆమోదించారనే ప్రచారం జరిగింది. గతంలో ఒక టీవీ చర్చ సందర్భంగా గంటాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని అనురాధ చెప్పారు. ఇప్పుడు ఆమె స్వయంగా మద్దతు కోరడంతో.. గంటా శ్రీనివాసరావు ముందుకొచ్చి అనురాధను బలపరుస్తూ పత్రాలపై సంతకాలు చేశారు. తెదేపాలో మొదటి ఓటు ఆదిరెడ్డి భవాని, చివరగా పయ్యావుల కేశవ్‌ వేశారు. ఉదయం 11.15 గంటలకు చంద్రబాబు నివాసం నుంచి బయల్దేరి శాసనసభకు వచ్చారు. ఎన్నికల ఏజంట్లుగా నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని