చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసు

విచారణకు హాజరుకావాలంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ-టీడీపీ ఇన్‌ఛార్జి చింతకాయల విజయ్‌కు సీఐడీ సీఐ గోపాలకృష్ణ 41-ఎ(1) నోటీసు జారీ చేశారు.

Updated : 26 Mar 2023 04:20 IST

31న విచారణకు హాజరుకావాలని వెల్లడి

నర్సీపట్నం, న్యూస్‌టుడే: విచారణకు హాజరుకావాలంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ-టీడీపీ ఇన్‌ఛార్జి చింతకాయల విజయ్‌కు సీఐడీ సీఐ గోపాలకృష్ణ 41-ఎ(1) నోటీసు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని విజయ్‌ ఇంటికి శనివారం ఉదయం ఇద్దరు సీఐడీ సిబ్బంది స్థానిక పోలీసులతో వచ్చారు. ఆయన స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో విజయ్‌ తండ్రి, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు నోటీసు అందజేశారు. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ‘ఈ నెల 28న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలంటూ 25వ తేదీ నోటీసు ఇస్తున్నారు. విజయ్‌ స్థానికంగా అందుబాటులో లేరు. ఇంత తక్కువ సమయంలో సమాచారం చేరవేయడం సాధ్యం కాకపోవచ్చు. గడువులో హాజరుకాకపోతే సీఐడీ అధికారులు రెచ్చిపోతారు. గడువు పొడిగిస్తే సంతకం పెట్టి నోటీసు తీసుకోవడానికి అభ్యంతరం లేదు’అని స్పష్టం చేశారు.ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతామన్న సిబ్బంది కాసేపటి తర్వాత మళ్లీ అయ్యన్నను కలిసి ఈ నెల 31న విజయ్‌ హాజరుకావాలంటూ నోటీసుపై తేదీ మార్పు చేసి ఇచ్చారు. ‘ఇలా పెన్నుతో మార్పు చేసి ఇస్తే ఎలా’ అంటూ.. అయ్యన్న తన అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా రాసి నోటీసు తీసుకున్నారు. గత ఏడాది నవంబరు 11న మంగళగిరి సీఐడీ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో విచారణకు విజయ్‌ హాజరు కావాలన్నది ఈ నోటీసు సారాంశం. సెక్షన్లు 464, 467, 471, 474 రెడ్‌విత్‌ 120 (బి), 34 ఐపీసీ కింద ఈ కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు